భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. ప్రపంచంలోని ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఇండియా నిలిచింది. కానీ ఇప్పటికీ మన దేశంలో కోట్లాది మంది పేదరికంలో మగ్గుతున్నారు. వారిని పేదరికం నుంచి బయటపడేయటానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. దీంతో పేదరికం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత 9 ఏళ్లలో.. అంటే మోదీ సర్కారు పాలనలో 24.87 కోట్ల మంది.. సుమారు పాతిక కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని నీతి ఆయోగ్ వెల్లడించింది.
పేదరికాన్ని అంచనా వేసేందుకు మల్టీడైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ (ఎంపీఐ)ను ఉపయోగిస్తారు. పేదరికం అంచనాలో ఎంపీఐ అనేది అంతర్జాతీయంగా గుర్తించిన కొలమానం అని చెప్పొచ్చు. ఈ ఎంపీఐ ఇండెక్స్ ప్రకారం 2013-14లో భారత్‌లో 29.17 శాతం మంది పేదరికంలో మగ్గేవారు. కానీ 2022-23 నాటికి ఇది 11.28 శాతానికి తగ్గింది. అంటే ఈ 9 ఏళ్లలో దేశంలో పేదరికం 17.89 శాతం మేర తగ్గింది. జనాభా పరంగా దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఈ 9 ఏళ్ల కాలంలో ఎక్కువ మంది పేదరికం నుంచి బయటపడ్డారు. యూపీలో 5.94 కోట్ల మంది పేదరికం నుంచి బయటకొచ్చారు. బిహార్‌లో 3.77 కోట్ల మంది, మధ్యప్రదేశ్‌లో 2.30 కోట్ల మంది, రాజస్థాన్‌లో 1.77 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటకొచ్చారని నీతి ఆయోగ్ రిపోర్ట్ వెల్లడించింది.
2015-16, 2019-21 మధ్య పేదరికం వేగంగా తగ్గిందని నీతి ఆయోగ్ తెలిపింది. ఈ కాలంలో ఏటా 10.66 శాతం చొప్పున పేదరికం తగ్గింది. 2005-06 నుంచి 2015-16 మధ్య ఇది 7.69 శాతంగా ఉంది. నీతి ఆయోగ్ రిపోర్టు పట్ల ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. సమ్మిళిత పురోగతి దిశగా.. మన ఆర్థిక వ్యవస్థను మార్చేసే దిశగా మాకున్న నిబద్ధతకు ఇది నిదర్శమని ప్రధాని తెలిపారు. ప్రతి భారతీయుడి భవిష్యత్తు సుసంపన్నంగా ఉండేలా.. ఆల్‌రౌండర్ డెవలప్‌మెంట్ కోసం తాము శ్రమిస్తున్నామని మోదీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.