పీకల్లోతు ఆర్ధిక సంక్షోభంలో కురుకుపోయిన దాయాది పాకిస్థాన్.. ఆ కష్టాల నుంచి గట్టెక్కేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు పాక్ నానా తంటాలు పడుతోంది. ఈ విషయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) రుణ సాయంపై ఆధారపడుతోన్న పాకిస్థాన్.. అది పెట్టిన షరతులకు తలొగ్గుతోంది. తాజాగా ఏడు బిలియన్ డాలర్ల రుణ ఒప్పందంలో భాగంగా పాలనాపర వ్యయాలను తగ్గించుకునేందుకు తలూపింది. ఇందుకోసం దేశంలో దాదాపు 1,50,000 ప్రభుత్వ ఉద్యోగాల్లో కోత విధిస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు, ఆరు మంత్రిత్వ శాఖలకు ఎత్తివేసి... మరో రెండింటిని విలీనం చేయనున్నట్లు తెలిపింది.
ఓవైపు, రాజకీయ అస్థిరత.. మరోవైపు, ఆర్ధిక సంక్షోభంతో పాక్ ప్రజలు గత రెండేళ్లుగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్యుల పరిస్థితి దుర్బరంగా మారింది. గత ఏడాది పాకిస్థాన్ దివాలాకు చేరువైనప్పటికీ.. ఐఎంఎఫ్ 3 బిలియన్ డాలర్ల రుణ సాయంతో గండం నుంచి గట్టెక్కింది. ఇదే చివరిసారి అంటూ.. ఐఎంఎఫ్ నుంచి దీర్ఘకాలిక రుణం కోసం కొంతకాలంగా సుదీర్ఘ చర్చలు జరిపింది. పాక్ ప్రయత్నాలు ఫలించి చివరకు సహాయ ప్యాకేజీకి సెప్టెంబరు 26న ఐఎంఎఫ్ ఆమోదం తెలిపింది. కానీ, తమ షరతులకు లోబడి ఉంటేనే రుణం ఇస్తామని తేల్చిచెప్పింది.
ప్రభుత్వ వ్యయాలు తగ్గించుకోవడం, పన్ను- జీడీపీ నిష్పత్తిని పెంచడం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్ వంటి రంగాలపై పన్ను, రాయితీలు ఎత్తివేత వంటి చర్యలకు పాకిస్థాన్ హామీ ఇచ్చింది. దీంతో మొదటి విడతగా ఒక బిలియన్ డాలర్లను ఐఎంఎఫ్ విడుదల చేసింది. పాకిస్థాన్ ఆర్ధిక మంత్రి మహమ్మద్ ఔరంగజేబు మాట్లాడుతూ.. ‘‘ఇదే చివరి ప్యాకేజీ అని నిరూపించేలా మా విధానాలను అమలు చేయాల్సి ఉంటుంది.. ‘జీ 20’కూటమిలో చేరడానికి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాల్సి అవసరం ఉంది. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా ఆరు మంత్రిత్వ శాఖలను మూసివేస్తున్నాం.. రెండు మంత్రిత్వ శాఖలు విలీనమవుతాయి.. వివిధ మంత్రిత్వ శాఖల్లో 1,50,000 సిబ్బందిని తొలగించనున్నాం’’ అని వెల్లడించారు.
దేశంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య 16 లక్షల నుంచి 32 లక్షలకు పెరగడంతో ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందన్నారు. పన్నులు చెల్లించని వారు ఇకపై ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేయలేరని ఆయన అన్నారు. గతేడాది 3 లక్షల మంది, ఈ ఏడాది ఇప్పటి వరకూ 732,000 మంది కొత్తగా పన్ను చెల్లింపుదారులు నమోదుచేసుకున్నట్టు చెప్పారు. దేశ ఆర్ధిక వ్యవస్థ సరైన మార్గంలోనే వెళ్తోందని, విదేశీ మారకపు నిల్వలు పెరిగి గరిష్ఠానికి చేరుకున్నాయని ఔరంగజేబు వెల్లడించారు. అలాగే, జాతీయ ఎగుమతులు, ఐటీ ఎగుమతుల్లోనూ పురోగతి ఉందని, పెట్టుబాడుదారుల్లో ఆత్మవిశ్వాసం కల్పించడమే ఆర్ధిక వ్యవస్థను గాడినపెట్టడంలో గొప్ప విజయమని అన్నారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలసీ రేటును 4.5 శాతం తగ్గించిందని ఔరంగజేబ్ పేర్కొన్నారు. మార్పిడి రేటు, పాలసీ రేటు ఆశించిన విధంగానే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘ప్రభుత్వ విధానాల వల్ల ద్రవ్యోల్బణం తగ్గినందున ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందన్న మా ప్రకటనలు బూటకం కాదు. ద్రవ్యోల్బణం సింగిల్ డిజిట్‌కు పడిపోయింది’ అని ఆయన అన్నారు.