ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓలా, ఉబర్​కు కేంద్రం షాక్

national |  Suryaa Desk  | Published : Thu, Jan 23, 2025, 03:59 PM

యాప్‌ ఆధారంగా క్యాబ్‌ సర్వీసులు అందిస్తున్న ఉబర్‌ (Uber), ఓలా (OLA) సంస్థలపై ఇటీవల ఫిర్యాదులు ఎక్కువ కావడంతో కేంద్ర వినియోగదారుల మంత్రిత్వశాఖ (Consumer Affairs) స్పందించింది. ఆ రెండు సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఈ తరహా యాప్‌లు ఫోన్‌ ధరను బట్టి ఛార్జీలు వసూలు చేస్తున్నాయంటూ ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ అనే తేడా మాత్రమే కాకుండా.. ఫోన్‌ రేటును బట్టి కూడా ధరల్లో తేడా ఉంటోందని పలువురు వినియోగదారులు సోషల్‌ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరోపణలపై పూర్తి వివరణ ఇవ్వాలని ఉబర్‌, ఓలా సంస్థలను వినియోగదారుల మంత్రిత్వశాఖ ఆదేశించింది.మరోవైపు ఒకే సర్వీసుకు ఈ రెండు సంస్థలు వేర్వేరు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీనిపైనా కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ (సీసీపీఏ) చర్యలకు ఉపక్రమించింది. ఒకే సర్వీసుకు రెండు వేర్వేరు ధరలు ఎలా నిర్ణయిస్తున్నారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ధరల్లో వ్యత్యాసం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని సీసీపీఏ పేర్కొంది. ఛార్జీల విషయంలో నిజాయితీ, పారదర్శకత తీసుకొచ్చేందుకు సరైన వివరణతో రావాలని పేర్కొంది.  ఇటీవల దిల్లీకి చెందిన రిషభ్‌ సింగ్‌ అనే వ్యక్తి ఎక్స్‌లో పెట్టిన పోస్టు బాగా వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. క్యాబ్‌ సర్వీసులు అందించే ఉబర్‌ సంస్థ ఫోన్‌లను బట్టే కాదు.. అందులో ఉన్న బ్యాటరీ పర్సంటేజీ బట్టి కూడా ఛార్జీల్లో వ్యత్యాసం చూపిస్తోందని ఆయన ఆరోపించారు. రెండు ఆండ్రాయిడ్‌, రెండు ఐఓఎస్‌ డివైజులు వినియోగించి పరిశీలించినప్పుడు దీన్ని గుర్తించినట్లు తెలిపారు. అన్ని డివైజుల్లోనూ ఒకే అకౌంట్‌తో లాగిన్‌ అయి.. ఒకే ప్రదేశానికి రైడ్‌ బుక్‌ చేసినప్పుడు ఫేర్‌లో ఈ తేడా గుర్తించినట్లు సింగ్‌ తెలిపారు. ఈ తరహా ఫిర్యాదులపై సోషల్‌ మీడియాలో బాగా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం చర్యలకు సిద్ధమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com