ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైన్యంలోకి ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన హెలికాప్టర్లు,,,బోర్డర్‌లో ‘అపాచీ’ దండయాత్ర ఆరంభం

national |  Suryaa Desk  | Published : Tue, Jul 22, 2025, 10:18 PM

ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన హెలికాప్టర్లుగా గుర్తింపు పొందిన 'AH-64E అపాచీ’ క్రాఫ్ట్‌లు అధికారికంగా భారత సైన్యంలోకి చేరాయి. జోధ్‌పూర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్క్వాడ్రన్‌ 15 నెలల అనంతరం మొదటి మూడు అపాచీ హెలికాప్టర్లను స్వీకరించింది. తొలిదశలో మొత్తం ఆరు హెలికాప్టర్ల తయారీకి ఒప్పందం చేసుకుంది. అమెరికాకు చెందిన బోయింగ్ తయారుచేసిన ఈ హెలికాప్టర్ల విడి భాగాలను హైదరాబాద్‌ శివార్లలో టాటా భాగస్వామ్యంతో తయారయ్యాయి. సైన్యంలో ఈ హెలికాప్టర్లు చేరడం భారత పశ్చిమ సరిహద్దు ముఖ్యంగా పాకిస్థాన్ సమీప ప్రాంతాల్లో అత్యంత కీలకంగా మారనుంది. ప్రస్తుతం సైన్యం వద్ద ఉన్న 'ధ్రువ్ రుద్ర', 'ప్రచండ' వంటి స్వదేశీ హెలికాప్టర్లకు సాయంగా ఈ సూపర్ పవర్‌ రోటర్‌ క్రాఫ్ట్‌లుగా నిలుస్తాయి.


కాగా, అపాచీ హెలికాప్టర్లను భారత్‌ ఉపయోగించడం ఇదే మొదటిసారి కాదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (పఠాన్‌కోట్, జోర్హాట్ వైమానిక స్థావరాలు) ఇప్పటికే చైనా సరిహద్దుల్లో వీటిని మోహరించింది. ఇప్పుడు సైన్యానికి కూడా అపాచీ సేవలు అందించనుంది. భారీగా ఆయుధాలు కలిగి ఉన్న అపాచీ క్రాఫ్ట్‌లో 30 mm M230 చైన్ గన్, 70 mm హైడ్రా రాకెట్లు, ఆరు కిలోమీటర్ల దూరం నుంచి సాయుధ వాహనాలు, ట్యాంకులను నాశనం చేయగల AGM-114 హెల్ఫైర్ క్షిపణులు ఉంటాయి. అలాగే, గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులను కలిగి ఉంటుంది. ఇవి ట్యాంకులకు మాత్రమే కాకుండా, హెలికాప్టర్లు, UAVలను కూడా ధ్వంసం చేయగలువు. భారత సైన్యం , వైమానికదళం వెర్షన్లు ఒకేలా ఉంటాయి.


దీనిలో AN/APG-78 లాంగ్‌బో రాడార్ అపాచీకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. హెలికాప్టర్ రోటర్‌పై అమర్చిన ఈ మిల్లీమీటర్ వేవ్ రాడార్ ఒకేసారి 128 లక్ష్యాలను గుర్తించి, వాటిలో 16 టార్గెట్లను ప్రాధాన్యతనుబట్టి దాడి చేయగలదు. రాడార్లకు చిక్కకుండా కొండల్లో దాక్కుని టార్గెట్‌ను గుర్తించి ఒక్కసారిగా బటయకు వచ్చి విరుచుకుపడే సామర్థ్యం దీని ప్రత్యేకత.


ఈ హెలికాప్టర్లు డ్రోన్‌ల నుంచి ప్రత్యక్ష డేటా తీసుకునే సామర్థ్యం కలిగి ఉండటం వల్ల పైలట్లకు యుద్ధ భూమిపై పూర్తి అవగాహన లభిస్తుంది. శత్రుపై దాడులను సమన్వయం చేసేందుకు, కమాండర్‌కు బహుళ డొమైన్ సమాచారం అందించేందుకు ఇది దోహదపడుతుంది. ప్రస్తుత ఆరు అపాచీలకు మాత్రమే ఆర్డర్ చేసినప్పటికీ.. సైన్యం మరిన్ని హెలికాప్టర్లను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే చర్చలలో ఉన్నట్లు సమాచారం.


జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం మే నెలలో చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత, భారత సరిహద్దులో అపాచీ హెలికాప్టర్లు సైన్యంలోకి ప్రవేశించడంతో శత్రు కుట్రలకు చెక్ పెట్టే వీలు కలుగుతుంది. ఇవి ట్యాంకులు, ఉగ్రవాద శిబిరాలు, లాజిస్టిక్స్ కాన్వాయ్‌లు, రాడార్ కేంద్రాలపై అత్యంత వేగంగా, ఖచ్చితంగా దాడి చేయగలవు. బలమైన సురక్షణ వ్యవస్థలు, క్రాష్ రెసిస్టెంట్ డిజైన్, ఆర్మర్డ్ కాక్‌పిట్‌ల వల్ల ఇవి ఎటువంటి దాడినైనా తప్పించుకుని మిషన్‌ను పూర్తి చేయగలవు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa