రష్యా దాడులు వేగవంతం చేయడంతో తన దేశ రాజధాని కీవ్ నగర ప్రజలను ఉక్రెయిన్ ప్రభుత్వం అప్రమత్తంచేసింది. రష్యా సేనలు శనివారం ఉదయం ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలోకి చొచ్చుకెళ్లాయి. దీంతో వీధి పోరాటం మొదలైందని అధికారులు ప్రజలను హెచ్చరించారు. ప్రజలు షెల్టర్లు, బంకర్లలో ఉండాలని, కిటికీలకు దూరంగా ఉండాలని సూచించారు. పేలుళ్లు జరిగినపుడు శిథిలాలు ఎగిరిపడి, గాయాలయ్యే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రష్యా దళాలు క్షిపణులు, శతఘ్నులతో ఉక్రెయిన్ నగరాలపై దాడులు చేస్తోందని తెలిపారు. నల్ల సముద్రం నుంచి సుమే, పోల్టావా, మారౌపాల్ నగరాలపై క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిందని చెప్పారు. కీవ్‌లోకి చొచ్చుకొచ్చిన రష్యా సైన్యం.. నగరం మధ్యలోని ప్రభుత్వ భవనాల సమీపంలో భీకర కాల్పులకు తెగబడుతోందని ఆరోపించారు. విక్టరీ అవెన్యూ సైనిక స్థావరంపై రష్యా సైన్యం దాడులు చేస్తోంది. అయితే దాడులను తిప్పికొడుతున్నట్లు ఉక్రెయిన్ సైన్యం ఫేస్బుక్ వేదికగా వెల్లడించింది. కీవ్‌ను అధీనంలోకి తెచ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోన్న రష్యా సేనలు.. ఇతర నగరాలను కూడా హస్తగతం చేసుకుంటున్నాయి. తాజాగా మెలిటోపోల్ నగరాన్ని తమ బలగాలు అధీనంలోకి తీసుకున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. గురువారం ఉదయం ప్రారంభమైన యుద్దం కారణంగా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు, వందలాది మంది గాయపడ్డారు. వంతెనలు, భవనాలు, పాఠశాలలు, అపార్ట్‌మెంట్లు ధ్వంసమయ్యాయి. మరోవైపు, ఉక్రెయిన్ కోసం తమ పోరాటాన్ని ఆపబోమని, ఆయుధాలు వదిలిపెట్టే ప్రసక్తే లేదని అధ్యక్షుడు జెలెన్‌స్కీ మరోసారి స్పష్టం చేశారు. ఉక్రెయిన్ సైనికులు రష్యాకు లొంగిపోవాలని అధ్యక్షుడు పిలుపునిచ్చినట్లు వస్తోన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. అనేక నగరాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయని, ఈరోజు రాత్రి మనం దృఢంగా నిలవాలని ప్రజలకు సూచించారు. ఉక్రెయిన్ భవిష్యత్తు ఇప్పుడే నిర్ణయమవుతోందని పేర్కొన్నారు. రష్యాతో యుద్ధం నేపథ్యంలో సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని అమెరికా ఇచ్చిన ఆఫర్‌ను జెలెన్‌స్కీ తిరస్కరించారు. యుద్ధం ఉక్రెయిన్‌లో జరుగుతోందని, తనకు ఆయుధాలు కావాలని, పలాయనం కోసం మార్గం కాదని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. మరోవైపు, రష్యా దాడులతో అల్లకల్లోలంగా మారిన ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa