చైనా తరువాత తాజాగా సౌత్ కొరియాలో కరోనా మహమ్మారి విరుచుకుపడింది. బుధవారంనాడు రికార్డు స్థాయిలో 4 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.ప్రభుత్వ సమాచారం ప్రకారం, కొత్తగా 4 లక్షల 741 కొత్త కేసులు నమోదయ్యాయి. గత ఏడాది జనవరిలో తొలి కోవిడ్ కేసు వెలుగు చూసిన తర్వాత దేశంలో ఇంత పెద్ద సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. తాజా కేసులతో సౌత్ కొరియాలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 76 లక్షలలకు చేరుకున్నట్టు కొరియా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏజెన్సీ (కేడీసీఏ) తెలిపింది. సౌత్ కొరియాలో మంగళవారంనాడు కేవలం 24 గంటల్లో 293 మరణాలు సంభవించినట్టు అసోసియేటెడ్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
మరోవైపు, చైనాలోని షెంజెన్‌లో కోవిడ్ కేసులు ఒక్కసారిగా చెలరేగడంతో లక్షలాది మంది లాక్‌డౌన్ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. బుధవారంనాడు చైనాలో కొత్తగా 3,290 కేసులు నమోదు కాగా, వీటిలో 11 కేసులు సీరియస్‌గా ఉన్నట్టు చెబుతున్నారు. చైనాలో 2019లో తొలి కోవిడ్ కేసు వెలుగుచూసింది. అయినప్పటికీ మృతుల సంఖ్యను మాత్రం గత ఏడాది నుంచి అధికారికంగా అధికారులు ప్రకటించడం లేదు.