by Suryaa Desk | Thu, Jan 30, 2025, 08:35 PM
నందమూరి బాలకృష్ణ ప్రజ్ఞా జైస్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj). ఈ సినిమా సక్సెస్‌లో భాగంగా ప్రజ్ఞా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఒకవేళ ఈ చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేయాల్సి వస్తే హీరో పాత్రకు సల్మాన్ ఖాన్ సెట్ అవుతారని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘ఈ సినిమాలో హీరో పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది. ఇది తప్పకుండా సల్మాన్ ఖాన్‌కు నప్పుతుంది. అలాగే, ఇందులో గుర్రపు స్వారీకి సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి సన్నివేశాలు సల్మాన్‌కు సెట్ అవుతాయి. ‘డాకు మహారాజ్’ పాత్రకు ఆయన ప్రాణం పోయగలడు’’ అని ప్రజ్ఞా జైస్వాల్ చెప్పారు.తాను పోషించిన కావేరి పాత్ర గురించి మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు బాబీ.. కావేరి రోల్ గురించి చెప్పినప్పుడు సవాలుగా అనిపించింది. కావేరి ప్రెగ్నెంట్ అవుతుందని సినిమాకు సంబంధించిన కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలు నాపై చిత్రీకరిస్తారని తెలిసి ఎంతో భయపడ్డా. ఆ రోల్‌కు న్యాయం చేయగలనా? లేదా? అని కంగారుగా అనిపించింది. నటిగా ఇదొక అద్భుత అవకాశమని నాకు నేను సమాధానమిచ్చుకున్నా. మునుపెన్నడూ నేను ఇలాంటి పాత్ర పోషించలేదు. అందుకే ఈ సినిమాలో నటించా. ఈ సినిమాలో నాకు అన్ని సన్నివేశాలు ఇష్టమే. ముఖ్యంగా గ్రామం కోసం నేను ఫైట్ చేసే సీన్ నాకెంతో నచ్చుతుంది. ఆ సన్నివేశాన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా’’ అని ఆమె తెలిపారు.బాబీ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశీ రౌతేలా కీలక పాత్రలు పోషించారు. యాక్షన్, అడ్వెంచర్ ఫిల్మ్‌గా ఇది సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఇది విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. బాలకృష్ణ యాక్టింగ్‌ను సినీ ప్రియులు మెచ్చుకున్నారు.
Latest News