by Suryaa Desk | Thu, Jan 30, 2025, 08:40 PM
ఎంతో మంది ప్రజలను వేధించే సమస్యల్లో ఊబకాయం (obesity) ఒకటి. అధిక బరువుతో బాధపడుతున్న వారిలో ఇది అనేక తీవ్ర సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంటుంది. స్థూలకాయంపై గతంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) చేసిన ప్రసంగాన్ని ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా రీపోస్టు చేస్తూ.. బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఆయనపై ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా.. బరువు తగ్గేందుకు కొన్ని చిట్కాలను కూడా ఇచ్చారు.
‘‘ఊబకాయం గురించి ప్రధాని మోదీ చెప్పింది వాస్తవం. కొన్నేళ్లుగా నేనూ ఇదే చెబుతూ వస్తున్నా. ఇప్పుడు ప్రధాని మోదీనే స్వయంగా ఈ అంశాన్ని లేవనెత్తారు. మీరు ఆరోగ్యంగా ఉంటేనే అంతా బాగుంటుంది. సరిపడ నిద్ర, స్వచ్ఛమైన గాలి, సూర్యరశ్మి, మన వంటకాల్లో తక్కువ నూనె వాడకం, దేశీ నెయ్యి వినియోగించాలి. ఊబకాయంతో పోరాడేందుకు ఇవే పెద్ద ఆయుధాలుగా ఉపయోగపడుతాయి. అంతేకాకుండా వ్యాయామాన్ని మీ జీవితంలో భాగం చేసుకోండి. ఎలాంటి వ్యాయామమైనా కచ్చితంగా రోజూ చేసేందుకు ప్రయత్నించండి. నేను చెప్పింది నమ్మండి. స్థూలకాయాన్ని పాలదోలడంలో ఇది ఉపయోగపడుతుంది’’ అని షేర్ చేశారు. దీంతో పాటు ప్రధాని మోదీ గతంలో మాట్లాడిన వీడియోను జత చేశారు.
Latest News