|
|
by Suryaa Desk | Tue, Nov 04, 2025, 07:09 PM
మద్యం సేవించి వాహనాలు నడపవద్దంటూ.. ప్రభుత్వం, స్వచ్చంధ సంస్థలు, సెలబ్రిటీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ మందు బాబులుు మాత్రం మాట వినడం లేదు. యథేచ్చగా మద్యం తాగి.. వాహనాలతో రోడ్లపైకి వస్తున్నారు. ఇలా మద్యం సేవించి వాహనాలు నడిపేవారి కారణంగానే.. అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఎన్ని నివేదికలు చెబుతున్నా వారు మాత్రం మారడం లేదు. ఇక పోలీసులు ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు ఏర్పాటు చేస్తూ.. మందుబాబులను పట్టుకుంటున్నారు. అయినప్పటికీ చాలా మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ దొరికిపోతున్నారు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌ల్లో దొరికిన మందుబాబులకు భారీ ఎత్తున జరిమానాలు, జైలు శిక్షలు, ఇతర శిక్షలు వేస్తున్నా.. మారడం లేదు.
తాజాగా జగిత్యాల జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహించిన పోలీసులకు ఓ మందు బాబు పట్టుబడ్డాడు. వెల్గటూరు మండలం జగదేవ్‌పేటకు చెందిన 39 ఏళ్ల ఒల్లెపు సమ్మయ్య.. ఫుల్లుగా మద్యం సేవించి బైక్ నడుపుతూ పోలీసులకు దొరికిపోయాడు. అతడికి బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించగా.. ఏకంగా మెషీన్‌లో 550 బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ (బీఏసీ) పాయింట్లు చూపించినట్లు గొల్లపల్లి మండల ఎస్సై కృష్ణసాగర్ రెడ్డి వెల్లడించారు.
ఇక ఒల్లెపు సమ్మయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు జగిత్యాల కోర్టులో హాజరుపరిచారు. దీంతో స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ గంప కరుణాకర్.. మద్యం సేవించి వాహనం నడిపిన ఒల్లెపు సమ్మయ్యకు 10 రోజుల జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో నిత్యం అనేక మంది పోలీసులకు చిక్కుతున్నారు. ఇందులో చాలా మంది యువత ఉండటం గమనార్హం. ఇలాంటి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో జైలుకు వెళ్తున్న వారిలో కూడా ఎక్కువ మంది యువకులే ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మోతాదుకు మించి మద్యం సేవించి.. వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకునేందుకు పోలీసులు నిత్యం వేర్వేరు చోట్ల బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు.
ఇక మోతాదుకు మించి తాగిన వారికి భారీ మొత్తంలో ఫైన్లు విధిస్తున్నారు. ఇక బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో 300 బీఏసీ పైగా నమోదైన వారికి జైలుశిక్ష విధిస్తున్నారు. ఇక 3 సార్లకు మించి మద్యం సేవించి వాహనాలు నడుపుతూ దొరికిపోయిన వారి పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు.