|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 03:19 PM
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు మరోసారి తీవ్ర అన్యాయం జరిగిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఆదివారం నాడు పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన రూ.53.47 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌లో రాష్ట్రానికి ఆశించిన కేటాయింపులు ఏవీ దక్కలేదని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు పలుమార్లు ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రిని కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని భట్టి మీడియాకు తెలిపారు. మూసీ నది ప్రక్షాళన, రీజినల్ రింగ్ రోడ్, హైదరాబాద్ నగర అభివృద్ధి, మెట్రో రైల్ విస్తరణ వంటి కీలక ప్రాజెక్టులకు నిధులు వస్తాయని ఆశించామని, కానీ కేంద్రం మొండిచెయ్యి చూపిందని అన్నారు.ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ ఫార్మా హబ్‌గా గుర్తింపు పొందిందని, కరోనా సమయంలో భారత్ బయోటెక్ ప్రపంచానికే వ్యాక్సిన్లు అందించిందని గుర్తుచేశారు. అయినా ఫార్మా హబ్ కార్యక్రమాల్లో తెలంగాణకు చోటు దక్కకపోవడం దారుణమన్నారు. ఎలక్ట్రానిక్స్ రంగానికి బడ్జెట్‌లో రూ.40,000 కోట్లు కేటాయించినా, ఇప్పటికే అభివృద్ధి చెందిన హైదరాబాద్‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఆడియో-వీడియో, గేమింగ్, కామిక్స్‌కు కేంద్రమైన హైదరాబాద్‌ను కాదని, ‘ఆరెంజ్ ఎకానమీ’ కార్యకలాపాలను ముంబైకి తరలించడం అన్యాయమని అన్నారు.అంతేకాకుండా, టూరిజం, మెడికల్ హబ్, రేర్ ఎర్త్ మినరల్స్ వంటి రంగాల్లోనూ తెలంగాణను విస్మరించారని ఆరోపించారు. సెమీకండక్టర్ యూనిట్ కోసం సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రధానిని కోరినా, ఆ ప్రాజెక్టులను ఇతర రాష్ట్రాలకు కేటాయించి తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిందని భట్టి విమర్శించారు.