కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్ వద్ద సాగర హారతితో సముద్ర స్నానాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము 5 గంటలకు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మైన్స్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సముద్రుడికి హారతులు ఇచ్చి సముద్ర స్నానాలను ప్రారంభించారు. సముద్ర స్నానాలకు వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు.సముద్ర స్నానాల సందర్భంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. లక్ష నుండి రెండు లక్షల మంది వరకు భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను చేశారు. భక్తులు సముద్రం ఒడ్డున కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీక దీపాలతో సముద్ర తీరం వెలుగొందింది.
సముద్ర స్నానాల అనంతరం బీచ్ సమీపంలో ఉన్న దత్తరామేశ్వర క్షేత్రం (12 బావుల్లో)లో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. సముద్రంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు బారికేడింగ్ ఏర్పాటు చేశారు. ప్రమాదాలకు తావు లేకుండా గజ ఈతగాళ్లను నియమించారు. మంత్రి కొల్లు రవీంద్ర చిన్న పిల్లలకు ICDS ఆధ్వర్యంలో ఉచిత పాల పంపిణీని ప్రారంభించారు. చిన్న పిల్లల చేతులకు ట్యాగ్‌లు వేశారు. బీచ్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన పోలీసు భద్రతా చర్యలను మంత్రి రవీంద్ర పరిశీలించారు.