తనపై ప్రతీకారం తీర్చుకోవాలని నా ఇంట్లో ఆడవాళ్లను ఇబ్బంది పెడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఏదో ఒక రకంగా నన్ను, నా భార్యను అరెస్ట్ చేయాలని చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం మాయం కేసులో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని మాజీ మంత్రి పేర్ని నాని ఖండించారు. ఈ విషయంలో అధికారుల దర్యాప్తు కంటే సోషల్ మీడియాలో రచ్చ ఎక్కువైందని, పోలీసుల విచారణ పూర్తి కాకముందే ఉద్దేశపూర్వకంగా తనను దొంగగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘అద్దె కోసమే గోడౌన్ కట్టుకున్నాం. తప్పుడు పనులు చేయడానికి కాదు.
సివిల్ సప్లై అధికారులు నా భార్య జయసుధకు చెందిన గోడౌన్‌లో స్టాక్ ఉంచారు. టెక్నికల్‌గా మా తప్పు లేకపోయినా.. నైతికంగా బాధ్యత తీసుకుంటామని చెప్పాం. ఈ కేసులో విచారణ పూర్తి కాలేదని పోలీసులే చెబుతున్నారు. ఏదీ తేలకముందే నేనే దొంగనంటూ కూటమి నేతలు కొద్దిరోజులుగా నాపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు’’ . అయినా కూడా ఈ వ్యవహారంలో డిపార్ట్‌మెంట్ విచారణ కంటే సోషల్ మీడియా రచ్చ ఎక్కువైంది. కూటమి అనుకూల నేతలు, విశ్లేషకులు ఈ తప్పుడు ప్రచారంలో భాగం అయ్యారు. నేను పారిపోయానంటూ ప్రచారాలు చేశారు. నాపై ప్రతీకారం తీర్చుకోవాలని నా ఇంట్లో ఆడవాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. ఏదో ఒక రకంగా నన్ను, నా భార్యను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు’’ అని పేర్ని నాని ఆవేదన వ్యక్తం చేశారు.