కాంగ్రెస్ పార్టీకి చెందిన సందీప్ దీక్షిత్ ఫిర్యాదు మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలపై లెఫ్టినెంట్ గవర్నర్ విచారణకు ఆదేశించారు. ఈక్రమంలోనే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. కాంగ్రెస్, బీజేపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి తమను ఎదుర్కునే ధైర్యం లేకే కాంగ్రెస్‌ను అడ్డం పెట్టుకుంటుందని ఆరోపించారు. అలాగే తమను ఓడించేందుకు రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు కలిసి పని చేస్తున్నాయని వివరించారు. ఢిల్లీ ఎన్నికలకు ముందు మహిళలు, వృద్ధుల కోసం తాము తీసుకువచ్చిన సంక్షేమ పథకాలను ఆపడానికి రెండు పార్టీలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు.
సందీప్ దీక్షిత్ చేసిన ఫిర్యాదులో మొత్తం మూడు అంశాలు ఉన్నాయి. అందులో మొదటిది అర్హులైన మహిళా ఓటర్లకు 2100 రూపాయలు అందజేస్తామని ఆప్ ప్రకటించడం. రెండోది ఢిల్లీలోని కాంగ్రెస్ అభ్యర్థుల నివాసాల్లో పంజాబ్ కు చెందిన ఇంటెలిజెన్స్ అధికారులు పని చేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయనడం. ఎన్నికలకు ముందు పంజాబ్ నుంచి ఢిల్లీకి నగదు బదిలీ అయిందనేది మూడో అంశం. వీటిపై స్పందించిన అరవింద్ కేజ్రీవాల్.. ఈ ఆరోపణలను తోసిపుచ్చారు.
ముఖ్యంగా మహిళా సమ్మాన్ కార్డు, సంజీవని యోజన పథకాలు.. ఎన్నికల వాగ్దానాలు మాత్రమే అని.. అమలు కార్యక్రమాలు కాదని మరోసారి తేల్చి చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మహిళలకు రూ.2100 ఇవ్వడంతో పాటు 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం అందిస్తామని అరవింద్ కేజ్రీవాల్ మరోసారి వెల్లడించారు. అయితే ఈ రెండు పథకాల కోసం అనేక మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని కూడా తెలిపారు.
దీంతో భయాందోళనకు గురవుతున్న బీజేపీ.. ఈ రెండు పథకాల నమోదును ఆపేందుకు చేయాల్సిన అన్ని కుట్రలను చేస్తోందన్నారు. రౌడీలను సైతం పంపిస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి మహిళలు, వృద్ధుల సంక్షేమం అక్కర్లేదని.. అందువల్లే ఆప్ ఇచ్చిన ఎన్నికల హామీలు ఉత్తవే అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు. అలాగే ఢిల్లీ ప్రజలు తమ పేర్లను మోదు చేసుకోవడం ఆపొద్దని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీ ప్రజల కోసం తాను మరోసారి జైలుకు వెళ్లేందుకు అయినా సిద్ధమేనని చెప్పుకొచ్చారు. ప్రజలు ఏం చేసినా, ఎక్కడికి పంపినా వెళ్లేందుకు సిద్ధమైన తాను.. ప్రజల కోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటానని వివరించారు. 2025 ఫిబ్రవరి నెలలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలోనే ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు.. పరస్పర ఆరోపణలు చేసుకుంటూ ప్రజల నమ్మకాన్ని పొందేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి.