మరో 3 రోజుల్లో కొత్త సంవత్సరం రానుంది. చాలా మంది రకరకాల ప్లాన్లు వేస్తూనే ఉన్నారు. కొందరు ఉన్న ప్రాంతంలోనే ఎంజాయ్ చేయాలనుకుంటే మరికొందరు మాత్రం వచ్చిన హాలిడేస్‌ను సద్వినియోగం చేసుకునేందుకు టూర్లకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. వీరిలో కొందరు పుణ్యక్షేత్రాలు వెళ్లానికి ప్రిపేర్ అవుతుండగా.. మరికొందరు హాలిడే స్పాట్‌లు, శీతాకాలం వేళ ప్రకృతిని ఆస్వాదించడానికి ఎక్కడికి వెళ్లాలి అనేది సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అయోధ్య రామమందిర దర్శనం కోసం చాలా మంది ప్రణాళికలు వేసుకుంటున్నారు. న్యూ ఇయర్‌తోపాటు, మరికొన్ని రోజుల్లోనే అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరిగి ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో బాలరాముడిని దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అయోధ్యలో హోటల్స్ మొత్తం బుకింగ్ అయినట్లు తెలుస్తోంది.
కొత్త సంవత్సరం వేళ అయోధ్యకు వచ్చే భక్తుల కోసం.. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. బాలరాముడి దర్శనం కోసం భక్తులు భారీగా రానున్న నేపథ్యంలో దర్శన వేళలు పొడిగిస్తూ.. ఆలయ ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు ఎలాంటి లోపాలు తలెత్తకుండా అధికారులు అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. రాములోరిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు స్వాగతం పలికేందుకు అంతా సిద్ధంగా ఉందని అయోధ్య హోటల్ యజమానులు చెబుతున్నారు. జనవరి 15వ తేదీ వరకు హోటల్ రూమ్స్ మొత్తం ముందుగానే బుక్ అయిపోయాయని స్థానిక హోటల్ ఓనర్ అంకిత్ మిశ్రా తెలిపారు. చాలా తక్కువ హోటల్ రూమ్స్ మాత్రమే ఉన్నాయని నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇక న్యూ ఇయర్ సందర్భంగా అయోధ్యకు వచ్చే భక్తుల జేబులకు చిల్లు పెట్టేందుకు ఇదే సరైన సమయం అని కొందరు హోటళ్ల ఓనర్లు ఆలోచిస్తున్నారు. దీంతో ఒక్కరోజుకు రూ.10 వేల వరకు రూమ్ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో అయోధ్య పోలీసులు అలర్ట్ అయ్యారు. బాలరాముడి ఆలయం, హనుమాన్‌గఢి, లతాచౌక్, గుప్తర్ ఘాట్, సూరజ్‌కుండ్, ఇతర ప్రఖ్యాత స్థలాల వద్ద భారీగా భద్రతా ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఎలాంటి అవాంఛిత ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో చాలా ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. వారణాసి (కాశీ)లోని ఆలయాలను దర్శించుకునే భక్తుల కారణంగా.. ఉత్తర్‌ప్రదేశ్‌కు పర్యాటకులు భారీగా తరలివస్తూ ఉంటారు. ఇక ఈ ఏడాది జనవరి 22వ తేదీన ప్రారంభం అయిన అయోధ్య రామ మందిరంలో కొలువైన బాలరాముడిని దర్శించుకునేందుకు కూడా భక్తులు అయోధ్యకు క్యూ కడుతున్నారు. రామ మందిర ప్రారంభం తర్వాత మొదటి 6 నెలల్లో ఉత్తర్‌ప్రదేశ్‌కు పర్యాటకుల రాక గణనీయంగా పెరిగిందని యూపీ సర్కార్ వెల్లడించింది. ఒక్క జనవరిలోనే రికార్డు స్థాయిలో 7 కోట్లమంది అయోధ్యను సందర్శించారని ఇటీవల యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఒక ప్రకటన వెలువరించింది.