తమిళనాడు రాజధాని చెన్నై అన్నా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదివే ఓ విద్యార్థిపై ఇటీవలే సామూహిక అత్యాచారం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసును మద్రాసు హైకోర్టు ఈరోజు విచారించింది. ఈక్రమంలోనే బాధితురాలికి 25 లక్షల నష్ట పరిహారం అందించాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ముగ్గురు మహిళా ఐపీఎస్ అధికారులతో కూడిన సిట్ బృందాన్ని ఏర్పాటు చేసి కేసుపై విచారణ జరిపించాలని స్పష్టం చేసింది. బాధితురాలి విషయంలో తీసుకోవాల్సిన మరికొన్ని జాగ్రత్తల గురించి కూడా న్యాయస్థానం కామెంట్లు చేసింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న ఓ 19 ఏళ్ల విద్యార్థిని డిసెంబర్ 23వ తేదీ రోజు సాయంత్రం తన స్నేహితుడితో కలిసి క్యాంపస్ బయట మాట్లాడుతోంది. అప్పుడే అక్కడకు వచ్చిన ఓ ఇద్దరు దుండగులు యువతి స్నేహితుడిపై దాడి చేశారు. అతడిని అక్కడి నుంచి వెళ్లగొట్టి.. ఆపై ఇద్దరూ కలిసి ఆమెను హత్యాచారం చేశారు. ఒకరు రాక్షస క్రీడ జరుపుతుండగా మరొకరు వీడియో తీశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియో బయటపెడతామంటూ బెదిరించారు. ఆపై వాళ్లు పారిపోగా.. బాధితురాలు ఎలాగోలా హాస్టల్‌కు వెళ్లింది.
మరుసటి రోజు తన స్నేహితుడితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ లీకై బాధితురాలికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేగింది. ప్రతిపక్షాలు అన్నీ తమిళనాడు ప్రభుత్వంపై నిప్పులు చెరిగాయి. ఈ ఘటనలో నిందితుడికి డీఎంకేతో సంబంధాలు ఉన్నాయంటూ బీజేపీ నేతలు ఇప్పటికీ ఆరోపిస్తూనే ఉన్నారు.
ఇదిలా ఉండగా.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్‌పై మద్రాసు హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈక్రమంలోనే బాధితురాలి కేసును విచారించేందుకు ప్రత్యేక సిట్ బృందాన్ని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ బృందంలో ముగ్గురు మహిళా ఐపీఎస్ అధికారులు ఉండాలని కూడా స్పష్టం చేసింది. దీంతో పాటు బాధితురాలికి నష్ట పరిహారంగా 25 లక్షల రూపాయల పరిహారాన్ని అందజేయాలని వివరించింది. మరోవైపు యూనివర్సిటీకి కూడా బాధితురాలి వద్ద నుంచి ఫీజు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఇవి మాత్రమే కాకుండా ఈ కేసు వల్ల ఆమె చదువుకు ఎలాంటి ఆటంకం కల్గకుండా చూసుకోవాలని వివరించింది.