మండల-మకరవిళక్కు వార్షిక పూజల సందర్భంగా.. తెరుచుకున్న కేరళలోని అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు లక్షల్లో భక్తులు తరలివస్తున్నారు. దీంతో అయ్యప్ప నామస్మరణతో శబరిగిరులు మారుమోగిపోతున్నాయి. ఈ క్రమంలోనే వార్షిక మండల పూజల తర్వాత శబరిమల ఆలయాన్ని ట్రావెన్ కోర్ దేవస్వం అధికారులు.. ప్రధాన తంత్రి ఆధ్వర్యంలో ఆలయ ద్వారాలను మూసివేశారు. తిరిగి మకర విళక్కు పూజల కోసం ఈనెల 30వ తేదీన సాయంత్రం 5 గంటలకు శబరిమల ఆలయాన్ని తెరవనున్నారు.
ప్రధాన తంత్రి కందరరావు రాజీవరు, కుమారుడు కందరరావు బ్రహ్మదత్తుడు, మేల్‌శాంతి అరుణ్‌కుమార్ నంబూద్రీల ఆధ్వర్యంలో నవంబర్ 15వ తేదీన ప్రారంభం అయిన మండల పూజలు.. అంత్యం వైభవంగా నిర్వహించారు. మండల పూజాకాలంలో (నవంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 26వ తేదీ వరకు) శబరిమల అయ్యప్ప స్వామిని ... దాదాపు 32.50 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం అధికారులు వెల్లడించారు. శబరి కొండల్లో దర్శనం ఇస్తున్న అయ్యప్ప స్వామి ఆశీస్సుల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు.
ఇక డిసెంబర్ 30వ తేదీన సాయంత్రం 5 గంటలకు మకరవిళక్కు ఉత్సవాల కోసం శబరిమల ఆలయాన్ని మళ్లీ తెరవనున్నారు. జనవరి 14వ తేదీన శబరిమలలో మకరవిళక్కు నిర్వహిస్తారు. ఆ తర్వాత భక్తులకు అయ్యప్ప దర్శనాలు కల్పించి.. జనవరి 20వ తేదీన శబరిమల ఆలయాన్ని మూసివేయనున్నారు. జనవరి 14వ తేదీన శబరిమల కొండపై అయ్యప్ప భక్తులకు మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది. ఈ ప్రత్యేక ఘట్టానికి దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు ఏటా హాజరు అవుతారు. ఇక జనవరి 20వ తేదీన నిర్వహించనున్న పడిపూజతో శబరిమల యాత్ర ముగియనుంది. ఈ పూజతో కలిసి అయ్యప్ప స్వామి భక్తులు తాము తీసుకున్న దీక్షను ముగిస్తారు.