ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావును బీజేపీ ప్రతినిధి బృందం శనివారం కలిశారు. తిరుమల పరకామణి కేసు విషయంలో విచారణ చేయాలంటూ డీజీపీకి బీజేపీ నేతలు వినతి పత్రం అందజేశారు. కమలం నేతలు పాతూరి నాగభూషణం, తిరుపతి పాలకమండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ.. డీజీపీని కలిసిన వారిలో ఉన్నారు. అనంతరం టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో పరకమణిలో రవి కుమార్ అనే వ్యక్తి దొంగతనం చేస్తూ దొరికారని.. అతన్ని విజిలెన్స్ పట్టుకోవటం సంతోషకరమన్నారు.
కానీ డబ్బు రికవరీ చేయకుండా పోలీసులు, కొంతమంది బోర్డ్ మెంబెర్స్ కాపాడారని ఆరోపించారు. వాటాల కోసం కొంతమంది గజ దొంగలు ప్లాన్ వేశారని తెలిపారు. ఈ విషయంలో కొత్తగా ఆర్‌ఆర్‌ఆర్‌లు ఉన్నారని.. త్వరలోనే వారి పేర్లు బయటపెడతామని హెచ్చరించారు.గత విచారణలో టీటీడీపై ఓ పోలీస్ అధికారి ఒత్తిడి తెచ్చారని.. ఈ కేసు రాజీకి తీసుకుని వెళ్లిన ఆ పోలీస్ అధికారి ఎవరు అని ప్రశ్నించారు. రూ.100 కోట్లకు పైనే దోపిడీ జరిగిందన్నారు. క్లర్క్ స్థాయి వ్యక్తికి కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని నిలదీశారు. స్వామి వారి సొత్తు తిన్న ప్రతి ఒక్కరినీ కక్కిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంపై ఇప్పటికే టీటీడీ ఈవో విజిలెన్స్ విచారణకు ఆదేశించారని తెలిపారు. వైసీపీ దేవాలయాలను దోచుకుందని విమర్శించారు. పోలీస్ సర్వీస్, అడ్మిస్ట్రేటిక్ సర్వీస్‌ను వైసీపీ సర్వీస్‌గా మార్చుకుందని విమర్శించారు. గత ప్రభుత్వం ఈ కేసును ఎందుకు నిర్లక్యం చేసిందని భాను ప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.