ఏనుగుల కారణంగా నష్టాలబారిన పడిన బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి భరోసా ఇచ్చారు. గరుగుబిల్లి మండలంలోని సుంకి ప్రాంతంలో ఏనుగుల కారణంగా పాడైన పంటలను ఆమె శుక్రవారం పరిశీలించారు. అనంతరం బాధిత రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ సుంకి పరిధిలో గత వారం రోజులుగా గజరాజుల గుంపు సంచరిస్తోందని, అధికంగా వరి, అరటితో పాటు పలు రకాల పంటలు ధ్వంసమయ్యాయన్నారు. పంట నష్టాలను నమోదు చేసి అంచనా వేయాలని అటవీ శాఖ అధికారులకు సూచించారు. సంబంధిత సమస్యలపై జిల్లా అటవీ అధికారికి ఫోన్‌లో అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. పరిహారం విషయంలో జాప్యం నెలకొన కుండా త్వరితగతిన అందించేలా కృషి చేయాలన్నారు.
కురుపాం నియోజకవర్గం లో ఏనుగులు కారణంగా జరుగుతున్న నష్టాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలోని ఏనుగులు గుంపును తరలించేందుకు కర్ణాటక రాష్ట్రం నుంచి కుంకి ఏనుగులను తెప్పించే చర్యలు జరుగుతున్నాయన్నారు. అలాగే తుఫాన్ కారణంగా నష్టం వాటిల్లిన పంటల వివరాలను కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. ఈ పరిశీలనలో టీడీపీ నాయకులు ఎ.మధుసూదనరావు, ఎం.పురుషోత్తంనాయుడు, ఎం.తవిటినాయుడు, అంబటి రాంబాబు తదితరులు ఉన్నారు.