కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. పంపుల చెరువు కాలనీకి చెందిన ఓ బాలిక 8వ తరగతి చదువుతూ స్థానికంగా నివాసం ఉంటోంది. అయితే అదే ప్రాంతానికి చెందిన కొంతమంది యువకులు మద్యం, గంజాయి సేవిస్తూ కొన్ని రోజులుగా హల్‌చల్ చేస్తున్నారు. రోజూ పాఠశాలకు వెళ్లి వస్తున్న బాలికపై ఆ గంజాయి బ్యాచ్ కన్నుపడింది. బాలికను రోజూ ఫాలో చేసిన ఆ కామాంధులు సమయం కోసం ఎదురు చూశారు. కాగా, ఇవాళ (శనివారం) చిన్నారి ఒంటరిగా వెళ్లడాన్ని గమనించిన ఇద్దరు గంజాయి బ్యాచ్ బాలికను అపహరించారు. చిన్నారి కాళ్లు, చేతులను తాళ్లతో కట్టేసి పంపుల చెరువుల వెనక ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లారు. అనంతరం అత్యాచారయత్నానికి పాల్పడ్డారు.అయితే బాలిక గట్టిగా కేకలు వేయడంతో కుటుంబసభ్యులు, బంధువులు, స్థానిక యువత అప్రమత్తమయ్యారు. ఆమె అరుపులు వినిపిస్తున్న ప్రాంతానికి పరుగులు పెట్టారు. స్థానికులు వస్తుండడాన్ని గమనించిన నిందితులిద్దరూ చిన్నారిని వదిలేసి పారిపోయే ప్రయత్నం చేశారు. వెంటపడిన వారంతా ఒకరిని పట్టుకుని దేహశుద్ధి చేశారు.
మరో వ్యక్తి స్థానికులకు చిక్కకుండా పరారయ్యాడు. బాధిత కుటుంబం సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పారిపోయిన మరో వ్యక్తి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి అతన్నీ అదుపులోకి తీసుకున్నారు.అయితే అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తులు గంజాయి సేవించినట్లు బాలిక బంధువులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. గంజాయి సేవిస్తూ ప్రతి రోజూ స్థానికంగా హల్ చల్ చేస్తున్నారని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెబుతున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని, గంజాయి బ్యాచ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.