నితీష్ కుమార్ రెడ్డి.. బాక్సింగ్ డే టెస్టులో సెంచరీ తర్వాత నితీష్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. క్రికెట్ దిగ్గజాల దగ్గర నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల వరకూ నితీష్ కుమార్ రెడ్డికి అభినందనలు తెలియజేస్తున్నారు. నితీష్ కుమార్ రెడ్డి స్వస్థలం విశాఖ కావటంతో తెలుగు రాష్ట్రాల నుంచి అభినందనల వెల్లువ కొనుసాగుతోంది. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నితీష్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేశారు. తెలుగు కుర్రాడు సత్తాచాటాడు అంటూ అందరూ కొనియాడుతున్న సమయంలో నితీష్‌ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ పెట్టిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
" నువ్వు "భారత్"లోని ఏ ప్రాంతం నుంచి వచ్చావనేదీ ముఖ్యం కాదు. నువ్వు "భారత్" కోసం ఏం చేశావనేదే ముఖ్యం. నువ్వు మన భారత దేశాన్ని గర్వపడేలా చేశావ్ డియర్ నితీష్ కుమార్ రెడ్డి. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సెంచరీ చేసిన పిన్న వయస్కుడైన భారత క్రికెటర్‌గా నువ్వు చరిత్ర సృష్టించావ్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో 114 పరుగులతో నువ్వు ఆడిన ఆట.. అద్భుతం. ఇలాంటి ప్రపంచ రికార్డులను మరెన్నో నువ్వు అందుకోవాలని కోరుకుంటున్నా. భారత త్రివర్ణ పతాకాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని.. మీ ఆటతో ఎంతో మంది యువ క్రీడాకారులకు ఆదర్శం కావాలని కోరుకుంటున్నా. మీ ఆటతో యువతకు క్రీడల పట్ల అభిరుచి, దృఢ సంకల్పం, ఆసక్తిని పెంపొందించేలా స్ఫూర్తినివ్వాలని ఆశిస్తున్నా. ఈ సిరీస్‌లో భారత్ ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా" అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
అయితే నితీష్ కుమార్ రెడ్డి తెలుగు క్రికెటర్ కావటంతో అందరూ తెలుగు కుర్రాడు మెరిశాడు, సత్తా చాటిన తెలుగు కుర్రాడు అంటూ అభినందనలు తెలియజేశారు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం భిన్నంగా ట్వీట్ చేశారు. మన దేశంలో ఎన్ని వైవిధ్యాలు, ప్రాంతాలు ఉన్నా.. మనందరం భారతీయులం అని చాటేలా ట్వీట్ ద్వారా పవన్ కళ్యాణ్ తన ఉద్దేశాన్ని తెలియజేశారు. భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతదేశం విశిష్టత అని.. మనం ఎక్కడి నుంచి వచ్చినా మన అంతిమ లక్ష్యం దేశానికి గొప్పపేరు తీసుకురావటమే అనేలా పవన్ కళ్యాణ్ ట్వీట్ ఉందని నెటిజనం ప్రశంసిస్తున్నారు. భారతీయత, జాతీయం అనే భావాలను పవన్ కళ్యాణ్ తన ట్వీట్ ద్వారా తెలియజేశారని కామెంట్లు చేస్తున్నారు.