అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఫైల్స్ దహనం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్‌ను సీఐడీ పోలీసులు సోమవారం పలమనేరులో అరెస్ట్ చేశారు. చిత్తూరులోని సీఐడీ కోర్టులో అతడిని హాజరు పరిచారు. ఈ కేసులో అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక ఫైల్స్ దగ్దం కేసులో గౌతమ్ తేజ్.. ప్రధాన పాత్రధారిగా ఉన్నట్లు సీఐడీ పోలీసులు గుర్తించారు.మరోవైపు ఈ కేసులో ప్రధాన పాత్రదారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మదనపల్లి ఆర్డీవో హరిప్రసాద్, మాజీ ఆర్డీవో మురళితో సహా పలువురిని ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆదాయనికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే కారణంగా పాత ఆర్డీఓ మురళిని ఇప్పటికీ ఏసీబీ అధికారుల అరెస్టు చేసిన విషయం విధితమే.ఈ ఏడాది జులై 21వ తేదీ రాత్రి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎందుకంటే.. ఇది అగ్నిప్రమాదం కాదని.. ఉద్దేశ్యపూర్వకంగానే కీలక ఫైల్స్ కాల్చివేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వారి ప్రాథమిక విచారిణలో ఇది వాస్తమని తేలింది.ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాన్ని సీఐడీకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమల రావు... ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో అన్ని కోణాల్లో విచారణ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.