ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోనే అత్యంత సంపన్న సీఎం అని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. ఆయన కుటుంబానికి రూ.931 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు తెలిపింది. అదేసమయంలో ఆయనకు రూ.10కోట్ల అప్పు ఉందని వెల్లడించింది. సీఎంల ఆస్తులు, అప్పులపై సోమవారం ఏడీఆర్ ఒక నివేదిక విడుదల చేసింది. దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యంత తక్కువ ఆస్తులున్నది బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకే అని... ఆమె వద్ద రూ.15 లక్షల ఆస్తే ఉందని ఏడీఆర్ పేర్కొంది.
మొత్తంగా కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల సగటు సంపద రూ.52.59 కోట్లుగా ఉందని నివేదిక వివరించింది. అంతేకాదు, సీఎంల సగటు వ్యక్తిగత ఆదాయం రూ.13,64,310గా పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం.. మొత్తం 31 మంది సీఎంల సంపద రూ.1,630 కోట్లు. రూ.332 కోట్ల సంపదతో అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పెమాఖండు ధనికుల్లో రెండోస్థానంలో ఉన్నారు. జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రూ.55 లక్షల సంపదతో పేద ముఖ్యమంత్రుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. 13 మంది ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. హత్యాయత్నం, కిడ్నాప్, ముడుపులు, నేరపూరిత కుట్రలకు పాల్పడడం వంటి కేసులు ఎదుర్కొంటున్న వారు 10 మంది ఉన్నారు.