ఏపీలో ఇల్లు, భవనాలు నిర్మించేవారికి ముఖ్య గమనిక. భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల విషయంలో కీలక మార్పులు చేసింది. భవన నిర్మాణాలు, లేఅవుట్లకు అనుమతులు మంజూరు చేసే అధికారాన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీలకు అప్పగించింది. భవన నిర్మాణాలు, లేఅవుట్లకు గతంలో పట్టణాభివృద్ధి సంస్థ అనుమతులు ఇచ్చేది. అయితే ఆ అధికారాలను ఇప్పుడు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీలకు ఏపీ ప్రభుత్వం బదలాయించింది. ఈ మేరకు భవన నిర్మాణాలు, లేఅవుట్లకు అనుమతులు మంజూరు చేసే అధికార బదలాయింపుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ బిల్డింగ్ రూల్స్-2017, ఏపీ ల్యాండ్ డెవలప్‌మెంట్ రూల్స్- 2017లో సవరణలు చేస్తూ వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలు, పరిపాలన సౌలభ్యం కోసమే ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
దీంతో ఇకపై అన్ని రకాల భవనాలకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అనుమతులు జారీ చేయనున్నారు. అయితే పంచాయితీల విషయంలో ప్రభుత్వం చిన్న నిబంధన విధించింది. నగర పంచాయతీల్లో లేఅవుట్ విస్తీర్ణం 3 ఎకరాలకు పైగా ఉంటే టీడీసీపీ అనుమతి తప్పనిసరిగా ప్రభుత్వం పేర్కొంది.300 చ.మీ, 10 మీటర్ల ఎత్తు వరకూ గ్రామ పంచాయతీలు అనుమతులు మంజూరు చేస్తాయని తెలిపింది. అలాగే అనధికారిక కట్టడాలపై మున్సిపాలిటీ, కార్పొరేషన్, నగర పంచాయతీలు చర్యలు తీసుకునేలా అధికారాలు కల్పించింది.
ఏపీలో రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులపై పది రాష్ట్రాల్లో అధ్యయనం చేశారు. అనంతరం భవన నిర్మాణాలు, లేఅవుట్లు అనుమతులను సులభతరం చేస్తూ ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. భవన నిర్మాణ అనుమతులకు సింగిల్ విండో విధానం తీసుకువచ్చారు. అలాగే లేఅవుట్లలో రోడ్లను 12 మీటర్ల నుంచి 9 మీటర్లకు కుదించింది. అలాగే 500 చదరపు మీటర్లకు పైబడిన స్థలంలోని నిర్మాణాలకు సెల్లార్లకు అనుమతులు ఇచ్చారు. 15 మీటర్లలోపు భవన నిర్మాణాలకు అనుమతి అవసరం లేకుండా ఆదేశాలు జారీచేసింది. తాజాగా భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల మంజూరును సులభతరం చేసింది.