బ్రాండ్ ఏపీ పునరుద్దరణే లక్ష్యంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికపై యువనేత, రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ తమ గళాన్ని వినిపించారు. దావోస్ లో విజయవంతంగా తన పర్యటన పూర్తి చేసుకుని నేడు స్వదేశానికి బయలుదేరారు. దావోస్ వేదికగా నాలుగు రోజులపాటు జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో 30 మందికి పైగా గ్లోబల్ పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేశ్ ముఖాముఖి భేటీ అయ్యారు. తొలిరోజున స్విట్జర్లాండ్ పారిశ్రామికవేత్తలు, తెలుగు డయాస్పోరా సమావేశాలకు హాజరై రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఒకవైపు గ్లోబల్ పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి భేటీలు నిర్వహిస్తూనే మరోవైపు 8 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలపై తమ గళాన్ని వినిపించారు. వివిధరంగాలకు చెందిన 9 మంది అంతర్జాతీయ నిపుణులతో సమావేశమై ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలపై చర్చించారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రకటించిన ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు, అమలు చేస్తున్న ప్రోత్సహాకాలు, పరిశ్రమలకు అనువైన పర్యావరణ వ్యవస్థ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, క్లీన్ ఎనర్జీ వంటి రంగాల్లో ఏపీ ప్రభుత్వ ప్రాధాన్యతలు, అందిస్తున్న ప్రోత్సాహకాలు పారిశ్రామికవేత్తలకు వివరించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దార్శనిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏపీ ఏవిధంగా అభివృద్ధి పథంలో పయనిస్తుందో ప్రత్యక్షంగా వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, మిట్టల్ గ్రూప్ అధినేత లక్ష్మీ మిట్టల్ వంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలను కలసి పారిశ్రామికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దృక్కోణాన్ని సాక్షాత్కరించారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారిగా వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన మంత్రి లోకేశ్ ఒక్కక్షణం కూడా వృధా చేయలేదు. ఒకవైపు సమావేశాల్లో పాల్గొంటూనే ఖాళీ దొరికినపుడల్లా సీఎన్ బీసీ-టీవీ18, బిజినెస్ టుడే, ఎకనమిక్ టైమ్స్, బ్లూమ్ బర్గ్, మనీ కంట్రోల్ వంటి ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులతో ఇంటరాక్టివ్ సెషన్స్ కు హాజరై ఏపీలో పెట్టుబడులకు గల అనుకూలతలను వివరిస్తూ పారిశ్రామికవేత్తలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. అంతర్జాతీయంగా వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో తెస్తున్న సంస్కరణలు, ఫ్యార్మాస్యూటికల్, హెల్త్ కేర్, లాజిస్టిక్స్ రంగాల్లో పెట్టుబడులకు గల అవకాశాలను అంతర్జాతీయ వేదికపై నుంచి వివరించారు. డబ్ల్యూఈఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సుల్లో పాల్గొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అంతరంగాన్ని మైనస్ డిగ్రీల ప్రతికూల వాతావరణంలోనూ ఒకవైపు మంచువర్షం పడుతున్నా లెక్కచేయకుండా పట్టువదలని విక్రమార్కుడిలా దావోస్ రోడ్లపై నడుచుకుంటూ సమావేశాలకు హాజరై ఇతర రాష్ట్రాల ప్రతినిధులతో శెభాష్ అనిపించుకున్నారు. గురువారం తమ పుట్టిన రోజును కూడా పట్టించుకోకుండా రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఉదయం నుంచే పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదివిన చదువు, ప్రపంచ బ్యాంకులో పనిచేసిన అనుభవంతో డబ్ల్యూఈఎఫ్ వేదికగా వివిధ రంగాలపై నిర్వహించిన సమావేశాల్లో అలవోకగా తన మనోగతాన్ని వెల్లడించారు. ప్రపంచ పారిశ్రామికవేత్తలతో సమావేశమైన సందర్భంలోనూ మంగళగిరి చేనేతలపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. బిల్ గేట్స్, లక్ష్మీమిట్టల్ తో సీఎం చంద్రబాబుతో కలసి సమావేశమైన సందర్భంలో మంగళగిరి శాలువాలతోనే వారిని ముఖ్యమంత్రుల చేతులమీదుగా సత్కరించారు. తాము కలిసిన పారిశ్రామికవేత్తలందరినీ మంగళగిరి చేనేత శాలువాతో సన్మానించి తమ అభిమానాన్ని చాటారు. తాను ఎక్కడున్నా తమ మనసు మంగళగిరిలోనే ఉంటుందని చెప్పే మంత్రి లోకేశ్ మాటల్లోనే కాకుండా చేనేతలపై తన మమకారాన్ని చేతల్లో చూపించారు. ఇక దావోస్ వెళ్లే ముందు మంగళగిరి చేనేత శాలువాలను ప్రత్యేకంగా ఆర్డర్ చేసి సిద్ధం చేసుకొని వెళ్లారాయన. ఎటువంటి ఆడంబరాలకు తావీయకుండా డబ్ల్యూఈఎఫ్ వేదికగా ఏపీ బ్రాండ్ కోసం లోకేశ్ చేసిన కృషి కార్యరూపం దాల్చి త్వరలోనే రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.