మహాకుంభమేళా సందర్భంగా ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమానికి భక్తులు పోటెత్తుతున్నారు. నిత్యం కోట్లాదిమంది భక్తులు వచ్చి పుణ్య స్నానం చేసి వెళుతున్నారు. కోట్లాదిమంది ఒక్కచోట చేరినా కూడా అక్కడ స్వచ్ఛమైన గాలి వీస్తుండడం విశేషం. అయితే, దీని వెనక ఉత్తరప్రదేశ్ సర్కారు రెండేళ్ల కృషి దాగి ఉంది. మహాకుంభమేళా కోసం రెండేళ్ల ముందు నుంచే ఏర్పాట్లు ప్రారంభించిన యూపీ ప్రభుత్వం.. గాలి నాణ్యతపై ప్రత్యేక దృష్టిపెట్టింది. కోట్లాది మంది భక్తులు వచ్చే ప్రాంతం కావడంతో స్వచ్ఛమైన గాలి లభించే మార్గాలను అన్వేషించింది.అందులో భాగంగా జపాన్ టెక్నిక్ ‘మియవాకి’ను ఉపయోగించి మొక్కలు నాటారు. ప్రయాగ్ రాజ్ పరిధిలో పదిచోట్ల మొత్తం 18.50 ఎకరాల్లో ఏకంగా ఓ చిట్టడివినే తయారుచేసింది. తక్కువ ప్రదేశంలో వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటే టెక్నికే మియవాకి.. ఈ టెక్నిక్ తో మర్రి, రావి, వేప, చింత, ఉసిరి, రేగి, వెదురు.. ఇలా 63 రకాలకు చెందిన 5 లక్షలకు పైగా మొక్కలను అధికారులు నాటారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.6 కోట్లు ఖర్చుచేసింది. రెండేళ్లలో ఆ మొక్కలు చెట్లుగా ఎదిగి స్వచ్ఛమైన ఆక్సిజన్ ను వాతావరణంలోకి విడుదల చేస్తున్నాయి.