హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్‌లో భరతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన "భరతమాతకు మహా హారతి" కార్యక్రమంలో భాగంగా.. బాణాసంచా కాల్చారు. హుస్సేన్ సాగర్‌లోని రెండు బోట్లలో బాణాసంచా కాల్చుస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు అక్కడే పేలటంతో.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రెండు బోట్లకు మంటలు అంటుకున్నాయి. వేగంగా వ్యాపించిన మంటలతో 2 బోట్లు కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు అయినట్టు సమాచారం.
మంటలు చెలరేగటంతో.. బోటులో ఉన్నవారు వెంటనే హుస్సేన్ సాగర్‌లోకి దూకేశారు. పక్కనే ఉన్న మరో ఖాళీ బోటులోకి ఎక్కటంతో.. ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో.. ప్రాణనష్టం తప్పినట్టయింది. కాగా.. బోట్లలో మంటలు వ్యాపించిన సమయంలో రెండు బోట్లలో కలిసి ఆరుగురు వ్యక్తులున్నట్టు తెలుస్తుండగా.. అందులో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్టు సమాచారం. గాయాలైన క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. వీళ్లదిరి పరిస్థితి కూడా నిలకడగానే ఉందని.. ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని వైద్యులు చెప్పటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను సమీపంలో ఉన్న గాంధీ ఆసుపత్రితో పాటు యశోద, సరోజినీ దేవి ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురు వ్యక్తులకు బాణాసంచా పేలుడు దాటికి తీవ్ర గాయాలు కాగా.. కళ్లకు ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. బోట్లలో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు.
అయితే.. బాణాసంచా పెద్ద ఎత్తున పేలటంతో ఒక్కసారిగా బోట్లలో మంటలు వ్యాపించగా.. చుస్తున్నంత సేపట్లోనే అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో.. బోట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరి బోట్లు పూర్తిగా కాలిపోవటంతో ఎంత నష్టం వాటిల్లిందనేది తెలియాల్సిఉంది. మరోవైపు.. బోట్లలో బాణాసంచా ఎవరు కాల్చారు.. పర్మిషన్ తీసుకున్నారా లేదా.. అన్నది కూడా తెలియాల్సి ఉంది.