వరంగల్ జిల్లాలో మామూనురు ప్రధాన రహదారిపై ఇనుప స్తంభాలతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. రహదారిపై పక్క నుంచి వెళ్తున్న రెండు ఆటోలు, కారుపై లారీ పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిసింది. ఇనుప స్తంభాలు కావటంతో పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ప్రమాద సమయంలో రెండు ఆటోలు, కారులో ఎంత మంది ఉన్నారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
కాగా, ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుల్లో ముగ్గురు, మహిళలు, ఓ వ్యక్తి ఉన్నట్లు గుర్తించారు. లారీ డ్రైవర్ తాగిన మత్తులో ఉండటమే రోడ్డు ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద కారణంగా రెండు ఆటోలు పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయాయి. ఇనుప స్తంభాలు కావటంతో.. మృతదేహాలు వాటి కింద చిక్కుకున్నాడు. రోడ్డుపై ఇనుప స్తంభాలు చెల్లా చెదురుగా పడిపోగా.. వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ప్రమాదస్థలిలో పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు కూడా తెలియాల్సి ఉంది.
ఇక ఈ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించేందాలని అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని వరంగల్ జిల్లా కలెక్టర్‌ను, పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు.