తన రక్షణ ప్రణాళికను కొనసాగించడానికి మరియమాతను తల్లిగా దేవుడు ఎన్నుకున్నారు. స్త్రీలందరిలో మరియమాత ధన్యురాలు. క్రీస్తు తల్లి అయిన మరియమాతను గౌరవిస్తే దేవుడి అనుగ్రహాలు తప్పక లభిస్తాయి. లూర్దుమాత దర్శన భాగ్యం పొందిన వారు వరాలు పొందుతారు.’ అని విజయవాడ కథోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు అన్నారు. దక్షిణ భారతదేశంలో రెండో అతిపెద్ద కథోలిక పుణ్యక్షేత్రంగా ప్రసిద్దికెక్కిన గుణదల లూర్దుమాత మహోత్సవాల నవదిన ప్రార్థనలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పుణ్యక్షేత్రం ప్రధాన చర్చి వద్ద మరియమాత పతాకాన్ని బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు, మోన్సిగ్ఞోర్ మువ్వల ప్రసాద్, వికర్ జనరల్ మేకపాం గాబ్రియేలు, పుణ్యక్షేత్రం రెక్టర్ యేలేటి విలియం జయరాజు, డయాసిస్ ఎడ్యుకేషన్ డెస్క్ డైరెక్టర్ కొలకాని మరియప్ప, సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ తోట సునీల్ రాజు ఆవిష్కరించారు.
జపమాలతో భక్తులు కొండ మధ్యలోగల మరియమాత స్వరూపం వద్దకు చేరుకున్నాక, లూర్దుమాత స్వరూపం వద్ద సమష్టి దివ్యపూజాబలి సమర్పించారు. జగద్గురువులు పరిశుద్ద పోప్ ఫ్రాన్సిస్ 2025ను జూబ్లీ సంవత్సరంగా ప్రకటించారని బిషప్ తెలిపారు. ఈ ఏడాది 101వ గుణదలమాత మహోత్సవాలను భక్తులు దిగ్విజయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నేటి నుంచి తొమ్మిదిరోజులు నిర్వహించే నవదిన ప్రార్థనలతో లూర్దుమాత తిరునాళ్లకు భక్తులను సంసిద్ధులను చేస్తామన్నారు.