అరకులోయను పర్యాటకులు సందర్శించేందుకు హెలికాఫ్టర్ సేవలు అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యోచిస్తున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ అన్నారు. అరకులోయలో అరకు చలి ఉత్సవ్ సాంస్కృతిక కార్యక్రమాలను శుక్రవారం సాయంత్రం వర్చువల్‌లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖపట్నం నుంచి అరకులోయకు చేరుకోవాలంటే రెండున్నర గంటలుపాటు ప్రయాణించాల్సి వస్తుందని, దీనివల్ల పర్యాటకులు అసౌకర్యంగా భావిస్తున్నట్టు సీఎం దృష్టికి వెళ్లిందన్నారు.
ఈ నేపథ్యంలో విశాఖపట్నం నుంచి అరకులోయకు హెలికాఫ్టర్ సేవలు అందుబాటులోకి తీసుకు వస్తే పది నిమిషాల్లో చేరుకునే పరిస్థితి ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి పర్యాటకుల సౌకర్యార్ధం హెలీటూరిజంను అమల్లోకి తెచ్చే యోచనలో ఉన్నారన్నారు. అదేవిధంగా అల్లూరి జిల్లాలో సుందర సందర్శిత ప్రాంతాలున్నాయని, జిల్లాను టూరిజం హబ్‌గా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వీటిలో బొర్రాగుహలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. అరకులోయతోపాటు జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాలన్నింటిని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ అన్నారు.