వీఆర్‌లో వున్న తణుకు రూరల్ ఎస్‌ఐ ఏజీఎస్ మూర్తి(38) మృతిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మూర్తి ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు, బ్యాచ్‌మేట్స్, కుటుంబ సభ్యులు ఆరోపి స్తుంటే.. కాదు గన్‌మిస్ ఫైర్ అయ్యిందని జిల్లా ఎస్పీ నయీం అస్మి చెబుతున్నారు. కుటుంబ సభ్యులు, సహోద్యోగుల కథనం ప్రకారం.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కె.గంగవరానికి చెందిన ఆదుర్తి గోపా లరావు, తల్లి సూర్యావతిలకు ఇద్దరు కుమారులు వెంకటేశ్, మూర్తి, కుమార్తె శ్రీలక్ష్మి. మూర్తి టెన్త్ వరకు స్వగ్రామంలోనే చదివాడు. ఎంతో కష్టపడి 2012లో ఎస్‌ఐ ఉద్యోగం సాధించాడు. విజయలక్ష్మితో వివాహం కావడంతో వీరికి కుమారుడు చందన్(5) కుమార్తె హేమాన్షి (16 నెలలు) ఉన్నారు. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని మచిలీపట్నం, కైకలూరు, భీమవరం టూ టౌన్, పాలకోడేరు, పెరవలి, నరసాపురం రూరల్, ఆచంట, తణుకు రూరల్ స్టేషన్‌లలో పనిచేశాడు. వేల్పూరులో రెండు గేదెల అపహరణ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు.
ఈ క్రమంలో నాలుగు నెలలు క్రితం పోలీసు ఉన్నతాధికారులు వీఆర్‌లో పెట్టారు. అప్పటి నుంచి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. తనకు సంబంధం లేని కేసులో వీఆర్‌కు పంపారని అవమానంగా భావించాడు. పెను గొండలో సీఎం పర్యటనకు బందో బస్తుగా వెళ్లాలని ఆదేశాలు రావడంతో.. శుక్రవారం ఉదయం 7.30 గంటలకు తణుకు రూరల్ పోలీసుస్టేషన్‌కు బైక్‌పై వచ్చాడు. కొంతసేపటికి సర్వీసు రివాల్వర్ తీసుకుని పక్కనే ఉన్న వాష్ రూమ్‌కు వెళ్లి కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ విషయం తెలియగానే ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన 2012 బ్యాచ్ ఎస్‌ఐలు పెద్ద ఎత్తున తణుకు ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. అందరికి ధైౖర్యం చెప్పే మూర్తి ఇలా ఎందుకు చేశాడోనని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన పోలీసు శాఖలో కలకలం రేగింది. ఉన్నతాధికారుల నుంచి రకరకాల ఒత్తిళ్లు సిబ్బందిని కుంగిపోయేలా చేస్తున్నాయనే విమర్శలు వచ్చాయి.