ఇరిగేషన్ అధికారులపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 2058వ సంవత్సరం లోపు తాగునీటిని అందించాలనే లక్ష్యంతో అమృతధార పథకం చేపట్టినట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా 46 మండలాల్లోని గ్రామాలకు తాగునీరు అందివ్వడమే ఏపీ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అమృతధార పథకం కోసం రూ.8400 కోట్ల నిధులు విడుదల చేసినట్లు గుర్తుచేశారు. అమృతధార పథకం కోసం డీపీఆర్‌లు సిద్ధం చేయడంలో ఇరిగేషన్ అధికారులు వైఫల్యం చెందారని అన్నారు.ఈ ప్రాజెక్ట్‌పై స్పష్టంగా లేని రిపోర్ట్ ప్రభుత్వానికి అధికారులు ఇచ్చారని.. ఇలాంటి ధోరణిని వారు వెంటనే మార్చుకోవాలని హెచ్చరించారు.
హాఫ్ మైండ్ వర్క్ చేయొద్దని మందలించారు. అధికారులు పనిలో నిమగ్నమై సరైన డీపీఆర్ పంపించాలని అన్నారు. అధికారులకు తెలిసిందే రూల్ అనేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అధికారులు ఇచ్చే రిపోర్ట్‌పై రేపు(శనివారం) క్యాబినెట్లో తాను వివరించాల్సి ఉంటుందని అన్నారు. సమగ్రత లేని రిపోర్ట్‌తో ప్రాజెక్ట్ పనులు మధ్యలో ఆగిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. అధికారులు కేత్ర స్థాయిలో ప్రాజెక్ట్‌లను పరిశీలించాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు సరిగా వినియోగించుకోకపోతే వృథా అవుతాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.