కేంద్ర వార్షిక బడ్జెట్ 2025-26పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ప్రజలకు ఉపయోగకరమైన, ప్రగతిశీల బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ విజన్ ను ప్రతిబింబించేలా ఈ బడ్జెట్ ఉందని అభిప్రాయపడ్డారు. మహిళా సంక్షేమం, పేదలు, యువత, రైతులకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చారని, అంతేకాకుండా వచ్చే ఐదేళ్లలో ఆరు కీలక రంగాల్లో అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కేటాయింపులు చేసినట్టు అర్థమవుతోందని చంద్రబాబు వివరించారు. "దేశ సంక్షేమం దిశగా ఈ బడ్జెట్ ద్వారా కీలక ముందడుగు వేశారు. ఈ బడ్జెట్ మన దేశానికి సుసంపన్నమైన భవిష్యత్ ను అందించేలా సమగ్రమైన, కచ్చితమైన బ్లూప్రింట్‌గా నిలుస్తుంది. దాంతోపాటే... ఈ బడ్జెట్ ద్వారా మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అనదగ్గ మధ్య తరగతి ప్రజలకు పన్ను ఊరట కల్పించారు. ఈ బడ్జెట్‌ను నేను స్వాగతిస్తున్నాను" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.