వ్యవసాయంలో శ్రమ, కాలయాపన, ఖర్చు తగ్గించేందుకు యంత్రాలు దోహదపడుతున్నాయి. వరి నాట్ల నుంచి కోత, ధాన్యం నిల్వ చేసే వరకూ సాంకేతిక పరిజ్ఞానం రైతులకు మేలు చేస్తుంది. వరిలో పురుగు మందులను పిచికారీ కి డ్రోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని పెద్ద వ్యవసాయ క్షేత్రాలకే పరిమితమైన పురుగు మందులు వెదజల్లే డ్రోన్‌లు ఇప్పుడు గ్రామీణ ప్రాంత పంట చేలల్లో పురుగు మందులను వెదజల్లేందుకు సిద్ధంగా వున్నాయి.
ముఖ్యంగా వరి పంటపై ఆశించే చీడ, పీడల నివారణకు డ్రోన్‌ల వినియోగం చాలా అవసరం ఏర్పడింది. దీనిని దృష్టిలో వుంచుకుని రాష్ట్ర ప్రభుత్వం లాం వ్యవసాయ పరిశోధనా స్థానంలో వరి పురుగు మందులు వెదజల్లే డ్రోన్ నిర్వహణలో యువతకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. దీనితో పాటు ఢిల్లీ కేంద్రంగా పలు సంస్థలు వ్యవసాయంలో డ్రోన్‌ల నిర్వహణకు ప్రత్యేక శిక్షణను ఇస్తున్నాయి. పురుగు మందుల పిచికారీకి డ్రోన్ యంత్రాల నిర్వహణకు సంబందించి తణుకు రూరల్ మండలం దువ్వ గ్రామంలో వ్యవసాయ శాఖ ప్రయోగాత్మకంగా నిర్వహించింది.