నకిలీ మద్యం కేసులో కీలక సూత్రధారి రావూరి వెంకటరమణతో పాటు నలుగురు నిందితులను ఎక్సైజ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. రైల్వేకోడూరులో శుక్రవారం బహిర్గతమైన ఈ కేసులో ఇద్దరిని ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారి,ప్రధాన నిందితుడు వెంకటరమణను శనివారం తిరుపతిలో జిల్లా ఎక్సైజ్ ఈఎస్ నాగమల్లేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఏఈఎస్ వాసుదేవ చౌదరి, సీఐలు, సిబ్బంది చాక్యచక్యంగా పట్టుకున్నారు. కొంతమంది వైసీపీ నాయకులు తెరవెనుక ఉంటూ నకిలీ మద్యం వ్యాపారం నడిపించినట్లు విచారణలో తేలింది. కడప, తిరుపతికి చెందిన ఇద్దరు కింది స్థాయి నాయకుల హస్తముందని గుర్తించారు.
ప్రధాన నిందితుడు తిరుపతి కేంద్రంగా చేసుకుని విచ్చలవిడిగా నకిలీ మద్యం తయారు చేసి రూ.కోట్లు గడించాడు. ఇతనికి వరుసకు సోదరుడయ్యే సుబ్బయ్య (మచిలీపట్నం) సహకరించేవాడు. సుబ్బయ్యతో పాటు కేసుతో సంబంధమున్న చికెన్ శీను, మహేష్, ఓ స్టూడియో యజమాని శివశంకర్‌నాయుడులను అరెస్టు చేశారు. రైల్వే కోడూరు మండలం చిన్నచోడవరం వద్ద స్ట్టూడియోలో నకిలీ బాండ్ల లేబుళ్ళను తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అక్కడకు వెళ్లి కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు, 34వేల లేబుళ్ళను స్వాధీనం చేసుకున్నారు. రాజంపేటలో 50 క్యాన్ల స్పిరిట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. దామినేడులో చికెన్ శీను సోదరి ఇంటిలో నిందితులు ఉంచిన రూ.30 లక్షల విలువ చేసే ముడి పదార్థాలను సీజ్ చేశారు. ఈ కేసులో ఇంటి యజమానిని కూడా విచారించినట్లు తెలిసింది.