కర్నూలు జిల్లాలో మెరుగైన క్రీడా వసతులు కల్పించడంతో పాటు కర్నూలు జిల్లాను క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అనిమిని రవినాయుడు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఎంపీ నాగరాజుతో కలిసి కర్నూలు డీఎస్ఏ స్టేడియంను శనివారం సందర్శించారు. ముందుగా డీఎస్ఏ ముఖద్వారం వద్ద ఉన్న హాకీ మాంత్రికుడు పద్మశ్రీ మేజర్ ధ్యాన్‌చంద్ విగ్రహానికి వారు పూలమాలలు వేశారు. అనంతరం డీఎస్ఏ అవుట్డోర్ స్టేడియంతో పాటు జిమ్నాస్టిక్ ట్రైనింగ్ ఇండోర్ హాలును సంయుక్తంగా పరిశీలించారు. డీఎస్‌ఏలో విధుల నిర్వహణ అభివృద్ధి పనుల పురోగతి, పారిశుధ్య నిర్వహణ, క్రీడావసతుల కల్పనపై డీఎస్ఏ అధికారులతో చైర్మన్ ఆరా తీశారు.
అస్తవ్యస్తంగా ఉన్న డీఎస్ఏ నిర్వహణ పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అలసత్వంగా వ్యవహరిస్తున్న డీఎస్డీవో భూపతిరావు, డీఎస్ఏ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కర్నూలులో అత్యుత్తమ క్రీడావసతులను కల్పించి కర్నూలు స్టేడియాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ క్రీడా పోటీలు జరిగినా అక్కడ ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి క్రీడాకారులు ఉంటారని తెలిపారు. కర్నూలులో క్రీడాకారులకు సరైన వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కర్నూలులో క్రీడల అభివృద్ధికి మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటు నాగరాజు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని తెలిపారు. స్టేడియంల నిర్మాణాలకు జోహరాపురం, వాటర్‌ఫాల్స్ వద్ద రెండు స్థలాలను గర్తించామని, వాటికి సంబంధించి ప్రతిపాదనలు తయారు చేసి త్వరలో మంత్రుల సాయంతో అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమానికి ముందు పలువురు క్రీడాకారులు, క్రీడా సంఘాల నిర్వాహకులు, యువజన సంఘాల నాయకులు శాప్ చైర్మన్‌ను ఘనంగా సత్కరించారు.