విశాఖ పరిధిలోని గాజువాక సమీపం శ్రీనగర్‌లో నివాసం ఉంటున్న ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం ఫూల్‌బాగ్ ప్రాంతానికి చెందిన జి.భాస్కరరావు (24) శ్రీనగర్‌లో అద్దెకు నివాసం ఉంటూ ఫార్మాసిటీలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం భాస్కరరావు తమ పక్క ఇంట్లో ఉంటున్న ఓ యువతి స్నానం చేస్తుండగా వీడియో తీశాడు.
ఈ విషయం తెలిసి ఆ యువతి తల్లిదండ్రులు నిలదీయడంతో పాటు భాస్కరరావు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు విజయనగరం నుంచి ఇక్కడకు వచ్చారు. అయితే అప్పటికే ఫ్యాన్ హుక్‌కు భాస్కరరావు ఉరి వేసుకుని మృతి చెందాడు. అయితే భాస్కరరావు ఆత్మహత్య చేసుకోలేదని, కొట్టడం వల్లే మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. భాస్కరరావు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో యువతితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.