కాకినాడ జిల్లా, కిర్లంపూడిలో వైసీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి నివాసంలో ఓ తాగుబోతు భీభత్సం సృష్టించాడు. ఆదివారం తెల్లవారు జామున గన్నిశెట్టి గంగాధర్ అనే యువకుడు మద్యం సేవించి.. ట్రాక్టర్‌తో వచ్చి బీభత్సం సృష్టించాడు. ముద్రగడ కాంపౌండ్‌లో పార్కింగ్ చేసిన కారుతో పాటు ఫ్లెక్సీలు ధ్వంసం చేశాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ముద్రగడ నివాసానికి చేరుకుని గంగాధర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. దీని వెనుక ఎవరైనా ఉన్నారా.. లేక గంగాధర్ కావాలనే ముద్రగడ నివాసం వద్ద భీభత్సం సృష్టించాడా అన్న దానిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ముద్రగడ అనుచరులు ఆయన నివాసానికి చేరుకున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.