మద్యం, బెట్టింగ్, ఆన్‌లైన్ గేమ్స్ వంటి వాటిని మొదట్లో సరదాగా ప్రారంభిస్తారు. ఆ తరువాత వదలలేని పరిస్థితికి చేరుకుంటారు. ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలైన విద్యార్థులు తరగతి గదిలో ఉన్నా వారి ఆలోచనలన్నీ వాటి చుట్టూనే తిరుగుతుంటాయి. ఎంత వేగంగా ఇంటికి వెళదామా?, అని ఆలోచిస్తారు. ఇది క్రమంగా వ్యసనంగా మారి గంటల తరబడి ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడుతుంటారు. మద్యం, బెట్టింగ్‌కు బానిసలైనవారు తమ డబ్బులు లేక పోయినా అప్పు చేసి మరీ తాము కోరుకున్నది చేయాలని భావిస్తారు. ఈ క్రమంలో వద్దని వారించే వారిపై దాడులకు కూడా వెనుకాడరని వైద్య నిపుణులు చెబుతున్నారు.ఇటువంటి వ్యసనాలు (అడిక్షన్స్)తో బాధపడే వారిలో కొన్ని లక్షణాలు ఉంటాయి. తీవ్రమైన ఆందోళన, గాబరాతో ఉంటారు.
ఇంటికి ఆలస్యంగా వస్తుంటారు. వచ్చిన వెంటనే ఫోన్/కంప్యూటర్ ముందు కూర్చుంటారు. తినే సమయంలో కూడా ఫోన్‌తోనే గడుపుతారు. ప్రతి చిన్నదానికి తీవ్రంగా స్పందిస్తుంటారు. గట్టిగా కేకలు వేయడం, అరవడం చేస్తుంటారు. మద్యం/డ్రగ్స్ వంటి వాటికి బానిసలైన వారిలో ఆందోళన, పనిపై శ్రద్ధ పెట్టలేకపోవడం, డబ్బులు కోసం వెతకడం, అప్పులు చేయడం, ఇంటికి ఆలస్యంగా రావడం, కుటుంబ సభ్యులతో మాట్లాడకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. బెట్టింగ్ అడిక్షన్‌తో బాధపడేవారిలోనూ ఇటువంటి లక్షణాలే ఉంటాయి. అప్పులు చేయడం, పనిపై శ్రద్ధ పెట్టక పోవడం, తప్పుడు మార్గాలను అనుసరించడం, కుటుంబ సభ్యులపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేయడం వంటి లక్షణాలు ఉంటాయి. ఇంట్లో తెలియకుండా భారీగా అప్పులు చేస్తుంటారు.ఇటువంటి వ్యసనాలతో బాధపడే వారికి లక్షణాలను బట్టి చికిత్స చేయించాల్సి ఉంటుంది. మందులు, కౌన్సెలింగ్, గ్రూప్, ఫ్యామిలీ థెరపీలతో సాధారణ స్థితికి తీసుకురావచ్చు. వీరి వ్యవహారశైలిని నిశితంగా గమనించడం ద్వారా ప్రాథమిక దశలోనే చాలావరకు సమస్యను గుర్తించేందుకు అవకాశం ఉంది.