ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల గణన సర్వే చేపట్టాలని కూటమి ప్రభుత్వాన్ని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఐదున్నర కోట్ల రాష్ట్ర జనాభాలో వెనుకబడిన వర్గాల వారి సంఖ్య ఎంతో తేల్చాలంటూ ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఆమె సూచించారు. మంగళవారం విజయవాడలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విలేకర్లతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐదున్నర కోట్ల జనాభాలో వెనుకబడిన వర్గాల వారి సంఖ్య ఎంతో తేల్చాలన్నారు. అలాగే కుల వివక్షకు గురవుతున్న బలహీన వర్గాల ప్రజలు ఎంత మంది ఉన్నారో లెక్కలు తీయాలని ప్రభుత్వానికి విజ్జప్తి చేశారు.మనమెంతో మనకంతా అన్నట్లుగా.. రాజకీయ, సామాజిక, విద్యా, ఉద్యోగాలలో వారి వాటా వారికి దక్కాల్సి ఉందని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు.
జనాభా ప్రాతిపదికన న్యాయంగా రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు కులగణన చేపట్టినా.. బీజేపీ దత్తపుత్రుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్.. ఆ సర్వే వివరాలు తొక్కిపెట్టారని వైఎస్ షర్మిల వ్యంగ్యంగా అన్నారు. ఆ వివరాలు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారంటూ మాజీ సీఎం వైఎస్ జగన్పై మండిపడ్డారు. బీజేపీ డైరెక్షన్లోనే సర్వే రిపోర్టు బయటకు పొక్కకుండా కుట్ర చేశారంటూ వైఎస్ జగన్పై నిప్పులు చెరిగారు.ఇక ఓ వైపు దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తుంటే.. రిజర్వేషన్ల రద్దుకు కుట్ర అంటూ బీజేపీ తప్పు దారి పట్టించే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఉచ్చులో మీరు పడవద్దంటూ సీఎం చంద్రబాబుకు ఈ సందర్భంగా వైఎస్ షర్మిల సూచించారు. వెంటనే ఏపీలో సైతం కులగణన సర్వే చేపట్టాలని.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సూచించారు.