తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శమని ఈ సందర్భంగా వైఎస్ షర్మిల అభివర్ణించారు. ఇదో చారిత్రాత్మక ఘట్టమన్నారు. ఈ సర్వే యావత్ భారతావనికి దిక్సూచి అని తెలిపారు. దేశ భవిష్యత్ కోసం రాహుల్ గాంధీ దూరదృష్టికి ఇదొక నిదర్శనమన్నారు. తెలంగాణ రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీలు, 17 శాతం ఎస్సీలు, 10 శాతం ఎస్టీలు ఉన్నారని.. అంటే దాదాపు 90 శాతం వెనుకబడిన, బలహీన వర్గాల ప్రజలే ఉండటం విస్మయపరిచిన అంశమని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైతం ఇదే పరిస్థితి ఉంటుందని తాము నమ్ముతున్నామని ఈ సందర్భంగా వైఎస్ షర్మిల పేర్కొన్నారు.గతంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. దేశవ్యాప్తంగా జోడో యాత్ర చేశారు. ఈ సందర్భంగా దేశంలో కుల గణన జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. కుల గణన సర్వే చేపడతామని ఆయన ప్రకటించారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో తెలంగాణ వ్యాప్తంగా కుల గణన సర్వే చేపట్టారు. ఆ సర్వే వివరాలను ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‍లో సైతం కుల గణన సర్వే నిర్వహించాలని చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.