ఒకప్పుడు ఏ ఇంట్లో చూసినా భారతీయ శైలిలో టాయిలెట్లు ఉండేవి. కానీ రోజులు మారాయి. పల్లెలు, పట్టణాల్లో భారతీయ శైలి టాయిలెట్ల వాడకం తగ్గింది. చాలా మంది వెస్ట్రన్ టాయిలెట్స్‌ను వాడుతున్నారు. ఒకప్పుడు వీటిని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లలో మాత్రమే చూసేవాళ్లం. ఇప్పుడు దాదాపు చాలా ఇళ్లలో వాడుతున్నారు. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. చిన్న పిల్లలు, వృద్ధులకు ఈ టాయిలెట్స్ వాడటం చాలా సులభం. అంతేకాకుండా మోకాలి నొప్పులతో, కాళ్ల నొప్పులతో బాధపడేవారికి వెస్ట్రన్ టాయిలెట్స్ సౌకర్యవంతంగా ఉంటాయి. అయితే, వెస్ట్రన్ టాయిలెట్స్ రూపురేఖలు కూడా మారాయి. వెస్ట్రన్ టాయిలెట్ వ్యవస్థలో రెండు ఫ్లష్ బటన్‌లు ఉండటం మనం గమనించవచ్చు. అయితే, ఈ రెండూ బటన్‌లు ఎందుకున్నాయి? వాటి ఉపయోగం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
రెండు బటన్లు
ఆధునిక డబుల్ ఫ్లష్ టాయిలెట్లలో రెండు వేర్వేరు లివర్లు లేదా బటన్లు ఉంటాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. ఈ రెండు బటన్లు వాటి బాహ్య వాల్వ్‌లకు అనుసంధానించబడి ఉంటాయి. అయితే, ఈ రెండు బటన్ల వల్ల ఉపయోగం ఏంటి? రెండింటిలో ఒకటి పెద్దదిగా, మరొకటి చిన్నదిగా ఎందుకు ఉందో 99 శాతం మందికి తెలియదు. వాటి వల్ల ఉపయోగాలేంటి, వాటిని ఎందుకు వాడాలో ఇక్కడ తెలుసుకుందాం.
నీటి పరిమాణం భిన్నం
రెండు బటన్ల మధ్య తేడా ఏమిటంటే టాయిలెట్ నుంచి బయటకు ఫ్లష్ చేయవలసిన నీటి పరిమాణం. మీరు కమోడ్‌లోని పెద్ద బటన్‌ను నొక్కినప్పుడు, దాదాపు 6 నుంచి 9 లీటర్ల నీరు బయటకు వస్తుంది. చిన్న బటన్ 3 నుంచి 4.5 లీటర్ల నీటిని విడుదల చేస్తుంది. పెద్ద బటన్ ఘన వ్యర్థాల కోసం, చిన్న లివర్ ద్రవ వ్యర్థాల కోసం ఉపయోగించాలి.
ఉపయోగాలు కూడా భిన్నం
ఒకవేళ మీరు వెస్ట్రన్ టాయిలెట్స్ ఉపయోగిస్తుంటే.. ఈ రెండు బటన్‌లను పూర్తిగా ఎలా వాడాలో తెలుసుకుందాం. మూత్ర విసర్జన అంటే యూరిన్ పోసేటప్పుడు చిన్న బటన్‌ను నొక్కాలి. మలవిసర్జన తర్వాత పెద్ద బటన్‌ను ప్రెస్ చేయాలి. అయితే, చాలా మందికి ఈ విషయం తెలియకు ఈ రెండు బటన్లను కలిపి ఒకేసారి నొక్కేస్తున్నారు. దీంతో ఎక్కువ నీరు బయటకు వస్తుంది. కానీ, నీటి వృధా ఆపడానికే ఈ రెండు బటన్లను సెట్ చేశారు. అందుకే రెండు బటన్లను కలిపి నొక్కకూడదు. రెండు బటన్లను కలిపి నొక్కితే అవి పాడయ్యే ప్రమాదం కూడా ఉంది. బదులుగా వాటి ఉపయోగం ప్రకారం ఒక్కొక్కటిగా యూజ్ చేస్తే మంచిది.
ఈ విషయాలు తెలుసా?
మీరు ఫంక్షన్‌ను సరిగ్గా ఉపయోగించకపోతే, ఒకటి లేదా రెండు కాదు.. వందల లీటర్ల నీటిని వృధా చేసినట్టే. ఒకే బటన్‌కు బదులుగా రెండు బటన్‌ల ఫ్లష్ వ్యవస్థను ఉపయోగించడం ద్వారా, ఒక సంవత్సరంలో ఇళ్లలో దాదాపు 20,000 లీటర్ల నీటిని ఆదా చేయవచ్చని అధ్యయనం పేర్కొంది. రాబోయే కాలంలో మనం నీటిని ఆదా చేసి, తర్వాతి తరాలకు అందించాలి. కానీ మనం తెలియకుండానే వేల లీటర్ల నీటిని వృధా చేస్తున్నాం.
చరిత్ర
పాశ్చాత్య కమోడ్‌లలో ఈ రెండు-బటన్ వ్యవస్థ 1976లో కనుగొన్నారు. అయితే నాలుగేళ్ల తర్వాత అంటే 1980లో దీనిని మొదటగా ఆస్ట్రేలియాలో ఉపయోగించారు. ఆ తర్వాత మిగతా దేశాల్లో కూడా దీని వాడకం మొదలైంది. భారతదేశంలో కూడా ఇప్పుడు ఈ టాయిలెట్ల వాడకం పెరిగింది. ప్రతి నీటి చుక్క కూడా అమ్యూలమైనదే. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో నీటి కరువు ఉంది. అందుకే నీటిని ఆదా చేసేందుకు ఈ వ్యవస్థ మంచి ఆప్షన్ అంటున్నారు నిపుణులు.
![]() |
![]() |