రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వరకు సుమారు 14 కి.మీ. పొడవైన రోడ్డు విస్తరణ పనులకు నేడు శంకుస్థాపన చేశారు. యువగళం పాదయాత్ర సమయంలో ఈ ప్రాంత ప్రజలు రహదారి విస్తరణ చేపట్టాలని లోకేశ్ కు విన్నవించారు. ఆనాడు లోకేశ్ ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం డబుల్ రోడ్డుగా ఉన్న ఈ రహదారిని రూ.347 కోట్లతో 4 లేన్ల రహదారిగా విస్తరించనున్నారు. రెండేళ్ల కాలవ్యవధిలో చేపట్టే ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రధానంగా అచ్యుతాపురం జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ తోపాటు రెండు మైనర్ బ్రిడ్జిలు, 47 కల్వర్టులు నిర్మిస్తారు. ఈ ప్రాంతం విశాఖ-చెన్నయ్ ఇండస్ట్రియల్ కారిడార్ (VCIC), జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీ, స్పెషల్ ఎకనమిక్ జోన్ లో భాగంగా రాంబిల్లి, అచ్యుతపురం, పరవాడ వద్ద అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక క్లస్టర్లకు దగ్గరగా ఉంది. దీంతో భవిష్యత్ ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈరోడ్డు విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు. ఈ రోడ్డు విస్తరణ ప్రాజెక్ట్ రోడ్డు అనకాపల్లి సమీపంలోని NH-16 జంక్షన్ వద్ద ప్రారంభమై అచ్యుతాపురం వద్ద ముగుస్తుంది. ఈ రహదారి హరిపాలెం రోడ్డు, పూడిమడక రోడ్డు వెంబడి నివాసాలు, పారిశ్రామిక సంస్థలు, మత్స్యకార గ్రామాలకు ప్రధాన కనెక్టివిటీని అందిస్తుంది. ఇది అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో 5595.47 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్న APSEZ కు ప్రధాన కనెక్టివిటీని అందిస్తుంది. అనకాపల్లి సమీపాన నక్కపల్లి వద్ద ఆర్సెలర్ మిట్టల్ సంస్థ రూ.1.4లక్షల కోట్లతో కొత్తగా నిర్మించతలపెట్టిన స్టీల్ ప్లాంట్ కు కూడా కనెక్టివిటీని సులభతరం చేస్తుంది. ఈ రహదారి APSEZ, 180 పరిశ్రమల చుట్టూ ఉన్న ఇతర కీలక పారిశ్రామిక ప్రాంతాలను జిల్లా ప్రధాన కార్యాలయానికి అనుసంధానించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజూ లక్ష కంటే ఎక్కువ మంది ఉద్యోగుల రోజువారీ రాకపోకలను సులభతరం చేస్తుంది. అచ్యుతాపురం, మునగపాక, అనకాపల్లి మండల నివాసితులకు ట్రాఫిక్ కష్టాలను తగ్గిస్తుంది.
![]() |
![]() |