డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. డాక్టర్ ప్రభావతి విచారణకు హాజరుకావాల్సిందే అని సుప్రీం తేల్చి చెప్పింది. 7, 8 తేదీల్లో జరిగే విచారణకు ప్రభావతి విచారణాధికారి ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. విచారణకు సహకరించకపోతే మధ్యంతర రక్షణ రద్దు అవుతుందని న్యాయస్థానం తెలిపింది. విచారణకు ఎలా సహకరించడం లేదో అనే విషయాన్ని ప్రభుత్వ తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా సాక్షాలతో సహా కోర్టు ముందు ఉంచారు. కస్టోడియల్ టార్చర్‌లో రఘురామకు ఎలాంటి గాయాలు లేవంటూ అప్పట్లో గుంటూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌గా ఉన్న డాక్టర్ ప్రభావతి నివేదిక ఇచ్చారు. ఆ నివేదికపై ప్రభుత్వం కేసు వేసింది. ప్రభుత్వం పెట్టిన కేసులో ముందస్తు బెయిల్ కావాలంటూ హైకోర్టును ప్రభావతి ఆశ్రయించారు. అయితే హైకోర్టులో ఆమెను నిరాశే ఎదురవడంతో.. వెంటనే సుప్రీం కోర్టును ఆశ్రయించారు ప్రభావతి. దీంతో ప్రభావతికి సుప్రీం కోర్టు మధ్యంతర రక్షణ కల్పించడంతో పాటు విచారణకు హాజరుకావాల్సిందిగా గతంలో ఆదేశాలు జారీ చేసింది. అయితే విచారణకు హాజరుకావడం లేదని, విచారణకు సహకరించడం లేన్నందున గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణను తొలగించాలంటూ మరో పిటిషన్‌ను సుప్రీంలో ప్రభుత్వం దాఖలు చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ కె.విశ్వనాథమ్‌తో కూడిన ధర్మాసనం ఈరోజు (మంగళవారం) విచారించింది. అయితే ఒక్కసారి మాత్రమే విచారణకు పిలిచారని.. మళ్లీ పిలవకుండా విచారణకు సహకరించడం లేదంటే ఎట్లా అంటూ ప్రభావతి తరపు న్యాయవాది వాదించారు. కానీ తాము ఇచ్చిన నోటీసులకు ప్రభావతి ఏ విధంగా స్పందించారు, గతంలో విచారణకు హాజరుకాలేమంటూ లాయర్ చేత సమాధానం ఇప్పటించారని, అలాగే తన భర్త చేత సమాధానం ఇప్పించారని.. ఇలా ప్రతీసారి ఏదో ఒక సాకుతో ప్రభావతి విచారణకు హాజరుకావడంత లేదని.. అందువల్ల ఆమెకు ఇచ్చిన మధ్యంతర రక్షణను రద్దు చేయాలని ప్రభుత్వ తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ప్రభావతి విచారణకు సహకరించాలని ఆదేశించారు. ఈనెల 7, 8 తేదీల్లో ఉదయం 10 గంటలకు సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో విచారణాధికారి ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. విచారణకు సహకరించకపోతే గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణ కోల్పోవాల్సి వస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 15కు సుప్రీం కోర్టు వాయిదా వేసింది.
![]() |
![]() |