తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలోని అనుప్పల్లి పంచాయతీ రేఖల చేను గ్రామంలో వైయస్ఆర్‌సీపీ కార్యకర్త భూపతిరెడ్డిపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నేతలు అర్ధరాత్రి మారణాయుధాలతో దాడి చేశారు. ఇంటి ముందు మంచంపై నిద్రిస్తున్న వ్యక్తిపై కత్తులతో దాడి చేయగా అతను పెద్దగా అరవడంతో గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే రెండు సార్లు కత్తులతో పొడవడంతో గొంతు, కడుపు భాగంలో కత్తిపోట్లు దిగాయి. తీవ్ర గాయాలతో కుప్పకూలిన వైయస్ఆర్‌సీపీ కార్యకర్త భూపతిరెడ్డిని హుటాహుటిన తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న చంద్రగిరి నియోజకవర్గం వైయస్ఆర్ సీపీ ఇన్‌చార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆసుపత్రికి చేరుకుని రక్తగాయాలతో చికిత్స పొందుతున్న భూపతిరెడ్డిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రాణాపాయ స్థితి లేకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే ప్రశాంతమైన రేఖల చేను గ్రామంలో ఫాక్షన్ గొడవలు తెచ్చిపెడుతున్న టీడీపీ వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో బాధితులతో కలసి ఆందోళనలు చేపడతామని మోహిత్ రెడ్డి హెచ్చరించారు. అధికార పార్టీకి చెందిన రెచ్చగొట్టి గొడవలు చేస్తుంటే తమ పార్టీ నాయకులు సంయమనం పాటిస్తున్నారని, అయినా పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వేదింపులకు గురిచేస్తుండటం మంచిది కాదన్నారు. పోలీసులు గ్రామంలో శాంతిని నెలకొల్పాలని, దాడికి పాల్పడిన వారందరిపై హత్యాయత్నం కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని ఆయన డిమాండ్ చేశారు.
![]() |
![]() |