వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం విదితమే. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరిన ఆయనను, మరింత మెరుగైన వైద్యం కోసం ముంబయికి తరలించారు. ఈ నేపథ్యంలో కొడాలి నాని ఆరోగ్యంపై సోషల్ మీడియాలో పలు పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయి.ఈ విషయంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ, కొడాలి నాని గుండె నొప్పితో బాధపడుతున్నారని, వైద్యులు ఆపరేషన్ చేయాలని చెప్పారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తూ వికృతానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాని ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో ఆపరేషన్ చేస్తే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందనే కారణంతోనే ఆయనను ముంబయికి తీసుకువెళ్లారని తెలిపారు.కొడాలి నానికి ఆపరేషన్ చేయనున్న డాక్టర్ రమాకాంత్ పాండేకి సర్జరీలు చేయడంలో విశేష అనుభవం ఉందని ఆయన పేర్కొన్నారు. ఒకటి రెండు రోజుల్లో నాని ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, వైద్యులు ఆపరేషన్ తేదీని నిర్ణయిస్తారని, ఆపరేషన్ అనంతరం ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వస్తారని, ఇందులో ఎటువంటి సందేహం లేదని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని అంబటి రాంబాబు విజ్ఞప్తి చేశారు.
![]() |
![]() |