మంగళగిరి సమీపంలోని చినకాకాని వద్ద వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ నేడు శంకుస్థాపన చేశారు. కూటమి నేతలతో కలిసి భూమిపూజ నిర్వహించిన అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం, కల్చరల్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ కూడా పాల్గొన్నారు. దీనిపై నారా లోకేశ్ సోషల్ మీడియాలో స్పందించారు. "మంగళగిరి ప్రజల మూడు దశాబ్దాల కల వంద పడకల ఆసుపత్రి. ఏడాదిలోగా ఆ కలను నెరవేరుస్తామని చెప్పాను. ఇప్పుడు మాట నిలుపుకుంటున్నాను. ఇవాళ 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి భూమి పూజలో పాల్గొన్నాను. 1984లో స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారు వైవీసీ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకం వద్ద సెల్ఫీ దిగాను. మంగళగిరి పట్టణంలో 40 ఏళ్ల క్రితం 30 పడకల ఆసుపత్రికి అన్న ఎన్టీఆర్ గారు శంకుస్థాపన చేశారు. 40 ఏళ్ల తర్వాత 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి నేను శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉంది" అని పేర్కొన్నారు.
![]() |
![]() |