టీటీడీ ఐటీ విభాగంలోనూ గత హయాంలో నిబంధనలకు విరుద్ధంగా జీఎం స్థాయి అధికారి నియామకం జరిగిందని ఈవో ఆరోపించారు. ఐటీ విభాగం వైఫల్యం కారణంగానే ఒకే దళారి ఏకంగా 50 సార్లు ఆర్జిత సేవా టికెట్లను పొందగలిగారని తెలిపారు. స్వామివారికి వినియోగించే ఆవు నెయ్యి కొనుగోలులో, అన్నప్రసాదం తయారీలో నాణ్యత లోపించిందని, గతంలో కల్తీ నెయ్యి సరఫరా చేసిన దాతను బ్లాక్ లిస్ట్ లో పెట్టామని తెలిపారు. ప్రస్తుతం నాణ్యమైన నందిని నెయ్యిని వాడుతున్నామని, అన్నప్రసాదాల నాణ్యతను కూడా గణనీయంగా మెరుగుపరిచామని అన్నారు. ఆర్గానిక్ ప్రసాదాల పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, కేవలం రూ.3 కోట్ల విలువైన సరుకులకు ఏకంగా రూ.25 కోట్లు చెల్లించినట్లు గుర్తించామని శ్యామలరావు పేర్కొన్నారు. వివాదాస్పద వైష్ణవి డెయిరీకి గత మార్చిలో ఇచ్చిన పాల సేకరణ టెండర్‌ను నాణ్యతా లోపాల కారణంగా రద్దు చేశామని వెల్లడించారు.తాను జూన్ 2024లో ఈవోగా బాధ్యతలు స్వీకరించే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశానని, టీటీడీలో వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయని, వాటిని సరిదిద్దాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని శ్యామలరావు గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలను సరిదిద్ది, టీటీడీలో ప్రక్షాళన కార్యక్రమాలు చేపట్టామని, భక్తుల మనోభావాలకు అనుగుణంగా వసతులను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. వ్యవస్థలను గాడిలో పెట్టి, పారదర్శకమైన పాలన అందించడమే తమ లక్ష్యమని ఈవో స్పష్టం చేశారు.
![]() |
![]() |