ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా గ్రీన్‌కార్డుదారులను పెళ్లి చేసుకున్నా పౌరసత్వం కష్టమే!

international |  Suryaa Desk  | Published : Tue, Apr 15, 2025, 10:10 PM

అమెరికన్‌ను లేదా గ్రీన్‌కార్డు పొందిన వ్యక్తిని పెళ్లి చేసుకుని అక్కడే స్థరపడాలని కోరుకునే వారి కలలపై ట్రంప్ నీళ్లు చల్లారు. వీరి ఆశలు అంత సులువుగా నెరవేరే అవకాశం ఏమాత్రం కనిపించడం లేదు. ముఖ్యంగా ఎప్పుడూ లేని విధంగా ఆంక్షలు విధించి.. వాటిని మరింత కఠినతరం చేశారు. దీంతో అమెరికన్, గ్రీన్ కార్డుదారులను పెళ్లి చేసుకుని యూఎస్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న దశలోనే.. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా వారికి నిజంగానే పెళ్లి అయింది, పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకున్నారు, ఎప్పుడు వారి బంధం బలపడింది, భాగస్వామి ఆహారపు అలవాట్లు, మిగతా పనుల గురించి కూడా ఇంటర్వ్యూలో ప్రశ్నించబోతున్నారు. ఇందులో ఏమాత్రం తేడాలు కనిపించినా వారికి పౌరసత్వం నిరాకరించేందుకు వెనుకడాట్లేదు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


అమెరికన్‌ను, గ్రీన్‌కార్డు పొందిన వ్యక్తులను పెళ్లి చేసుకుని అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుంటే.. యూఎస్ అధికారులు అత్యంత క్లిష్టమైన ఇంటర్వ్యూను నిర్వహిస్తారు. ముఖ్యంగా ఇతర దేశాలకు చెందిన వాళ్లతో పాటు పౌరసత్వం పొందిన వారిని పెళ్లి చేసుకున్నా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిందే. అయితే ఈ ఇంటర్వ్యూలో భాగస్వామి గురించి వారికి పూర్తిగా తెలిసి ఉండాలని ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు హెచ్చరిస్తున్నారు. వివాహానికి సంబంధించిన అన్ని పక్కా సాక్ష్యాలతో పాటు అనేక వివరాలు ఇట్టే చెప్పగలిగేలా ఉండాలని అంటున్నారు.


వీటికి సంబంధించిన పూర్తి వివరాలు గురించి అధికారులు తమను అడుగుతున్నారని న్యాయవాదులు వెల్లడిస్తున్నారు. అయితే ఇది త్వరలోనే అధికారిక విధానంగా మారే అవకాశం కూడా ఉందని అటార్నీ శర్మ వివరించారు. ఈక్రమంలోనే జీవిత భాగస్వామికి సంబంధించిన ఆహారం, నిద్ర అలవాట్లతో పాటు అలర్జీలు, ఇష్టాఇష్టాల గురించి పూర్తిగా తెలిసి ఉండాలన్నారు. అలాగే పెళ్లయిన జంట ఎక్కడ, ఎప్పుడు కలుసుకున్నారు, కలిసి ఎందుకు జీవించాలనుకుంటున్నారు, వారి మధ్య అనుబంధం ఎలా ఉంది వంటి అన్ని విషయాల గురించి ఇంటర్వ్యూలో ప్రశ్నించబోతున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా వీరిద్దరి మధ్య బ్యాంకు లావాదేవీలు, జాయింట్ ఖాతాలను సైతం పరిశీలిస్తారని చెప్పారు. అయితే ఈ ఇంటర్వ్యూలకు యూఎస్ పౌరసత్వం ఉన్న వారిని అనుమతించనందున.. ధ్రువీకరణ పత్రాలే వారి వివాహ బంధాన్ని రుజువు చేస్తుందన్నారు.


అంతేకాకుండా వీరిద్దరి మధ్య ఫోన్ కాల్స్, చాటింగ్, ఉత్తర ప్రత్యుత్తరాలు, ఇద్దరి పెళ్లిలో కుటుంబ సభ్యుల ప్రమేయం, వీరిద్దరూ కలిసి తిరిగిన ప్రదేశాలు, పర్యటనలకు సంబంధించిన విషయాలను సైతం ఇమ్మిగ్రేషన్ అధికారులు పరిశీలిస్తున్నట్లు అటార్నీ శర్మ స్పష్టం చేశారు. ఇవన్నీ నిజమని, వారిద్దరూ భార్యాభర్తలే అని తేలితేనే వారికి పౌరసత్వం ఇవ్వనున్నారని వెల్లడించారు. ఒకవేళ వారి వివాహం బోగస్ అని తెలిస్తే.. పెళ్లి చేసుకున్న వారిని అక్కడే వదిలేసి తిరిగి వారి దేశాలకు వెళ్లిపోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com