చంద్రయాన్ 4 ప్రయోగానికి సంబంధించిన కీలక అప్‌డేట్ బయటికి వచ్చింది. చంద్రుడి రహస్యాలను ఛేదించేందుకు.. అక్కడ పరిశోధనలు జరిపేందుకు కీలక ప్రయోగానికి చేసేందుకు ఇస్రో అధికారులు సిద్ధమయ్యారు. అంతరిక్ష రంగంలో ఏ దేశానికి సాధ్యం కాని విధంగా చంద్రయాన్ 3 ప్రయోగంతో భారత కీర్తి విశ్వవ్యాప్తం కావడంతో.. ఇస్రో తర్వాత చేపట్టబోయే చంద్రయాన్ 4 ప్రయోగంపై ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఊహించిన దాని కంటే ఎక్కువ సక్సెస్ అయిన చంద్రయాన్ 3 ప్రయోగంతో చంద్రయాన్ 4 ప్రయోగంపై అంతర్జాతీయంగా అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
చంద్రయాన్ 3 సక్సెస్ అయిన నేపథ్యంలో మరో 2 లూనార్ మిషన్లకు ఇస్రో సిద్ధం అవుతోంది. లూపెక్స్, చంద్రయాన్ 4 ప్రాజెక్టుల ద్వారా 350 కిలోల ల్యాండర్‌ను చంద్రుడి చీకటివైపు ఉన్న 90 డిగ్రీల ప్రాంతంలో విక్రమ్ ల్యాండర్‌ను దించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని.. అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ దేశాయ్ వెల్లడించారు. ఆ తర్వాత అక్కడ శాంపిల్స్ సేకరించి.. వాటిని భూమిపైకి తీసుకువచ్చేందుకు ఈ చంద్రయాన్ 4 ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.
అయితే మరో నాలుగైదేళ్లలో చంద్రయాన్ 4 ప్రయోగం చేపట్టేందుకు ఇస్రో వ్యూహాలు సిద్ధం చేస్తోంది. అయితే ఈ చంద్రయాన్ 4 ప్రయోగం ద్వారా చంద్రుడికి సంబంధించిన కీలక విషయాలను ప్రపంచానికి తెలియజేయాలని ఇస్రో సంకల్పించింది. చంద్రయాన్ 3 లోని విక్రమ్ ల్యాండర్.. జాబిల్లిపై అడుగుపెట్టిన శివశక్తి పాయింట్ నుంచి మట్టి శాంపిల్స్‌ను సేకరించి.. వాటిని భూమికి తీసుకువచ్చేలా ఈ ప్రయోగం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి.. ఇస్రో ఇప్పుడు ఒక భారీ మిషన్‌కు ప్రణాళికలు రచిస్తోందని ఎస్‌ఏసీ డైరెక్టర్ నీలేష్ దేశాయ్ శుక్రవారం పూణే పర్యటనలో భాగంగా తెలిపారు.
శివశక్తి పాయింట్ నుంచి రాళ్లు, మట్టి నమూనాలను భూమికి తీసుకురావడానికి ప్రయత్నిస్తామని నీలేష్ దేశాయ్ వెల్లడించారు. వచ్చే 5 నుంచి 7 ఏళ్లలో ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు ఆశిస్తున్నామని తెలిపారు. ఈ చంద్రయాన్ 4 మిషన్‌లో ప్రధానంగా 4 మాడ్యూల్‌లు ఉంటాయని తెలుస్తోంది. ట్రాన్స్‌ఫర్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, అసెండర్ మాడ్యూల్, రీ ఎంట్రీ మాడ్యూల్ ఉంటాయని ఇస్రో వర్గాల నుంచి సమాచారం. అందుకే చంద్రయాన్ 4 మిషన్‌లో 2 వేర్వేరు ప్రయోగ వాహనాలు ఉంటాయని.. ఈ ప్రయోగం.. ఇప్పటివరకు ఇస్రో చేపట్టిన మిగిలిన మూన్ మిషన్‌ల కంటే భిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ చంద్రయాన్ 4 ప్రయోగంపై దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది.