అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంలో 2019 నాటి తీర్పుపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రోహింటన్ ఫాలి నారిమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ తీర్పు న్యాయ వ్యవస్థను అవహేళన చేసేదిగా ఉందని ఆయన విమర్శించారు. రాజ్యాంగంలోని లౌకికవాద సూత్రాలకూ ఆ తీర్పు న్యాయం చేయలేదని జస్టిస్ నారిమన్ వ్యాఖ్యానించారు. జస్టిస్ ఎ.ఎం.అహ్మది తొలి స్మారకోపన్యాసం సందర్భంగా ఢిల్లీలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో జస్టిస్ నారిమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘లౌకికవాదం-భారత రాజ్యాంగం’ అనే అంశంపై మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
బాబ్రీ మసీదును కూల్చడం అక్రమమని తేల్చి చెప్పిన న్యాయస్థానం.. వివాదాస్పద భూమిని అప్పగించడానికి చూపిన కారణాలతో తాను ఏకీభవించలేకపోతున్నానని పేర్కొన్నారు. అయితే, ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనల) చట్టం-1991ను సమర్థించడమనే సానుకూల అంశం కూడా అయోధ్య తీర్పులో ఉందని చెప్పారు. వేయి తలల కాల సర్పంలా దేశవ్యాప్తంగా ప్రతిరోజూ ప్రార్థనా స్థలాల వివాదాలు పడగ విప్పుతున్న నేపథ్యంలో ఈ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.
మసీదులు, దర్గాలకు వ్యతిరేకంగా ప్రతిరోజు న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలవుతున్నాయని, ఇవి మతసామరస్యాన్ని దెబ్బతీస్తాయని జస్టిస్ నారిమన్ హెచ్చరించారు. ప్రార్థనా స్థలాల చట్టం అమలుతోనే ఈ వివాదాలకు అడ్డుకట్ట పడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులందర్నీ దోషులుగా ప్రకటించిన సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి సురేంద్ర పదవీవిరమణ తర్వాత ఉత్తర్ ప్రదేశ్ డిప్యూటీ లోకాయుక్తగా నియమితులైన విషయాన్ని ప్రస్తావించారు. ఇదీ దేశంలో పరిస్థితి అని జస్టిస్ నారీమన్ వ్యాఖ్యానించారు.
అలాగే, ఆర్ధికంగా వెనుకబడిన తరగతులు (ఈడబ్ల్యూఎస్) )వారికి రిజర్వేషన్ల కల్పించిన 108 రాజ్యాంగ సవరణను సమర్ధిస్తూ ఇచ్చిన తీర్పును కూడా జస్టిస్ నారిమన్ విమర్శించడం గమనార్హం. ‘ఈ ఆర్థిక ప్రమాణాల తీర్పు రాజ్యాంగ చట్టంలో లేదా ఏ రకమైన మౌలిక సూత్రాల పరంగా సరైంది కాదు’ అని అభిప్రాయపడ్డారు. ఈడబ్ల్యూఎస్ కోటాపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 3-2 మెజార్టీతో తీర్పు చెప్పింది.